ఆల్‌ ఇండియా పోలీస్‌ కమెండో కాంపిటీషన్స్‌ ప్రారంభం

Jan 22,2024 16:21 #AP police, #visaka

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : 14వ అల్‌ ఇండియా పోలీస్‌ కమాండో కాంపిటీషన్‌ (ఎఐపిసిసి)- 2024 పోటీలు సోమవారం విశాఖపట్నం కాపులుప్పడలోని గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం సిటీ పోలీస్‌ కమిషనర్‌, అడిషినల్‌ డిజిపి ఎ రవిశంకర్‌ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి జట్లతో పాటు పారామిలటరీ దళాలు పాల్గొంటున్న ఈ పోటీలకు గ్రేహౌండ్స్‌ విభాగం ఆతిథ్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇది ప్రపంచంలో అత్యుత్తమమైన కమెండో పోటీలని, అన్ని జట్లు తమ విభాగాలలోని ఉత్తమ కమెండోలను ఎంపిక చేసి పంపాయని చెప్పారు.

గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డిజిపి రాజీవ్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ 30వ తేదీన ముగింపు వేడుకలకు రాష్ట్ర డిజిపి కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ పోటీలకు జాతీయ స్థాయిలో 23 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్నారు. అందులో రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఒడిశా, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, జమ్మూ కాశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌ జట్లు, కేంద్ర పోలీసు సంస్థలకు చెందిన ఆర్‌పిఎఫ్‌, బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌, సిఐఎస్‌ఎఫ్‌, ఐటిబిటి, ఎస్‌ఎస్‌బి, అస్సాం రైఫిల్స్‌ జట్లు పాల్గొంటున్నాయని వెల్లడించారు. సుమారు 750 నుంచి 800 సభ్యులు ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీల్లో అన్ని జట్లు ఐదు దశలలో నేవిగేషన్‌, స్కిల్‌టెస్ట్‌, ప్లానింగ్‌ అండ్‌ ప్రెజెంటేషన్‌, ఫిజికల్‌, ఫైరింగ్‌లో పాల్గొంటాయన్నారు. అల్‌ ఇండియా స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డుకు చెందిన 50 మంది సభ్యుల బృందం.. విజేతలను నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌కంట్యాక్స్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సింగ్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ చైర్మన్‌ అతుల్‌ సింగ్‌, గ్రేహౌండ్స్‌ ఆపరేషన్స్‌ డిఐజి కొయ్య ప్రవీణ్‌, విశాఖపట్నం రేంజ్‌ డిఐజి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️