రిపబ్లిక్‌ డే నాటికి అంబేద్కర్‌ విగ్రహం సిద్ధం

Nov 28,2023 09:33 #BR Ambedkar, #cm jagan
  • సమీక్షలో ముఖ్యమంత్రికి అధికారుల నివేదన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో నిర్మిస్తున్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని రాబోయే రిపబ్లిక్‌ డే నాటికి సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నిర్వహించిన సమీక్షలో అధికారులు నివేదించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడమని, ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొదించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. నిర్ధేశించుకున్న గడువులోగా పనులను పూర్తి చేయాలని, విగ్రహం ప్రారంభించే నాటికి ఒక్కపని కూడా పెండింగ్‌లో ఉండకూడదని అధికారులను సిఎం ఆదేశించారు. కన్వెన్షన్‌ సెంటర్‌లో మౌలిక సదుపాయాలను పక్కాగా కల్పించాలని, నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నడకదారి పొడవునా గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. నిరంతరం పనుల పర్యవేక్షణ జరగాలన్నారు. స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ కాన్సెప్ట్‌గా అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం ఏర్పాటవుతోందని, అంబేద్కర్‌ విగ్రహ పీఠం ఎత్తు 81 అడుగులు, విగ్రహం ఎత్తు 125 అడుగులు అని సిఎంకు అధికారులు తెలిపారు. అలాగే కృష్ణలంక ప్రాంతంలో రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్లు సుందరీకరణ పనులపై పలు ప్రతిపాదనలను సిఎంకు అధికారులు వివరించారు. పార్కు, వాకింగ్‌ ట్రాక్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, స్పెషల్‌ సిఎస్‌ వై శ్రీలక్ష్మి, ఎపిఐఐసి ఎమ్‌డి ప్రవీణ్‌కుమార్‌, ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టరు ఎస్‌ ఢిల్లీరావు, విజయవాడ మున్సిపల్‌ కమిషనరు స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పాల్గొన్నారు.

➡️