అంగన్వాడీలకు మద్దతుగా 24న రాష్ట్ర బంద్

anganawadi workers bnadh in ap
  •  ట్రేడ్‌ యూనియన్ల ప్రకటన
  •  ప్రజా సంఘాల మద్దతు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీల అరెస్టులను నిరసిస్తూ బుధవారం రాష్ట్ర బంద్‌ నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్‌, టిఎస్‌టియుసి రాష్ట్ర అధ్యక్షులు జి రఘురామరాజు, ఐఎన్‌టియుసి రాష్ట్ర నాయకులు క్రాంతికుమార్‌ సోమవారం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. లక్షా ఆరువేల మంది అంగన్‌వాడీ మహిళలు, శ్రామికుల వేతనాలు, పనిభారాలు తదితర సమస్యలపై 42 రోజులుగా సమ్మె జరుగుతోందని అన్నారు. వారి డిమాండ్లకు ప్రజల నుండి సేకరించిన కోటి సంతకాలను జగనన్నకు సమర్పించడానికి వస్తున్న వారిపై పోలీసులు పాశవికంగా దాడిచేశారని పేర్కొన్నారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం నిరంకుశమని తెలిపారు. నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న శిబిరాన్ని తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కూల్చివేశారని తెలిపారు. కరెంటు తీసేసి మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులే అరెస్టులు చేస్తూ యుద్ధ భూమిని తలపింపజేశారని పేర్కొన్నారు. రెండువేల మందిని అరెస్టు చేసి మచిలీపట్నం, నూజివీడు, ఏలూరు పంపించారని పేర్కొన్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ పాశవిక విధానానికి వ్యతిరేకంగా, బాధిత అంగన్‌వాడీలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్‌ చేయాల్సిన అవసరం ఉందని అఖిలపక్ష ట్రేడ్‌ యూనియన్లు భావించాయని పేర్కొన్నారు. ఈ బంద్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, వివిధ తరగతుల ప్రజలు బలపరచాలని వారు కోరారు. బంద్‌ను ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, రైతు సంఘంతోపాటు అనేక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు.

➡️