‘నిరవధిక’ దీక్షలు ప్రారంభం 

anganwadi strike 37th day protest in vja
  • శిబిరాన్ని ప్రారంభించిన ఎంఎల్‌సి లక్ష్మణరావు 
  • ప్రభుత్వం మొండి పట్టువైఖరి వీడాలని హితవు
  • దీక్షలలో 15 మంది అంగన్‌వాడీ నేతలు
  • పలు సంఘాల మద్దతు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో అంగన్‌వాడీల పోరాటంలో మరో మలుపుతిరిగింది. 37 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో సాగుతున్న ఆందోళనల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. వేతనాల పెంపు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోవడంతో మరోమార్గం లేక అంగన్‌వాడీలు బుధవారం నిరవధిక నిరాహార దీక్షలకు దిగారు. విజయవాడలోని ధర్నా చౌక్‌ ఈ దీక్షా పోరాటానికి వేదికైంది. 15మంది అంగన్‌వాడీ నేతలు దీక్షల్లో కూర్చున్నారు. సమస్యలు పరిష్కారం అjే్యంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి కెఎస్‌ లక్ష్మణ రావు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. వివిధ కార్మిక, ప్రజాసంఘాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరై తమ మద్దతు ప్రకటించారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 20 వ తేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు కార్మికసంఘాలు తెలిపాయి. అంతకుమందు దీక్షా శిబిరం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అంగన్‌వాడీలతో పాటు వారికి మద్దతుగా వచ్చిన పలువరు నిరవధిక దీక్షలు ప్రారంభానికి ముందు సాంబమూర్తిరోడ్డులోని అంబేద్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం శిబిరానికి తిరిగివచ్చి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు చేసిన నినాదాలతో ఈ ప్రాంతం మారుమ్రోగింది . దీక్షల్లో కూర్చున్న వారిని పలువురు అభినందించారు. నిరవధిక దీక్షల ప్రారంభ సభకు అంగన్‌వాడీసంఘ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి అధ్యక్షత వహించారు.శిబిరాన్ని ప్రారంభించిన ఎంఎల్‌సి కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని సూచించారు. ఎంత జీతం పెంచుతారు? ఎప్పటి నుంచి పెంచుతారనే విషయాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు సభలో ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగన్‌వాడీలు చేస్తున్న పోరాటానికి ఎపి జెఎసి అమరావతి తరపున తమ సంపూర్ణమద్దతు ఉంటుందన్నారు. మానవతా దృక్పదంతో సిఎం అంగన్‌వాడీల సమస్యను పరిష్కరించాలన్నారు. ఎఐటియుసి జనరల్‌ సెక్రటరీ ఓబులేషు మాట్లాడుతూ ఎస్మా ప్రయోగిస్తే భయపడతారని అనుకోవడం పొరబాటని అన్నారు. ఈనెల 20లోగా సమస్య పరిష్కరించకపోతే రాష్ట్రబంద్‌ చేయడానికి కూడా వెనుకాడమన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల పోరాటానికి ప్రత్యక్షంగా మద్దతిస్తామన్నారు. అంగన్‌వాడీలకు ప్రభుత్వం నోటీసులిస్తోందని వాటికి సమాధానాలు పంపుతామన్నారు. ఐఎఫ్‌టియు నాయకులు ప్రసాద్‌ మాట్లాడుతూ ఎస్మా ప్రయోగించి మరొక వైపు చర్చలకు పిలిచారంటేనే ప్రభుత్వం నైతికంగా రాజకీయంగా ఓడిపోయినట్లేనన్నారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ఖశ్చితంగా పరిష్కరించాల్సిందేనన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం చేయకపోతే లక్షమందితో తాడేపల్లి ప్యాలెస్‌ను మట్టడిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ అంగన్‌వాడీల పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తుందన్నారు. ఈ దీక్షా శిభిరంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, ముజఫర్‌, ఉమామహేశ్వరరావు, సిఐటియు అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు రావులపల్లి రవీంద్రనాధ్‌, పిఓడబ్ల్యు మహిళా అధ్యక్షురాలు గంగాభవాని, ఐఎఫ్‌టియు అధ్యక్షులు కె.పోలారి, సిఐటియు మద్యాహ్న భోజన పధకం రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి రవిచంద్ర, ఎపి శ్రామిక మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మీ, పాల్గొన్నారు.

అంగన్‌వాడీలకు మద్దతుగా 20న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు:

న్యాయమైన డిమాండ్లు సాధన కోసం అంగన్‌వాడీలు చేస్తున్న నిరవధికదీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్‌ యూనయన్ల అనుబంధ సంఘాలు ఆధ్వర్యంలో ఈనెల 20న అన్ని జిల్లాల్లో ఒక గంటపాటు రాస్తారోకోలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విజయవాడలోని భేటీ అయిన కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. రాస్తారోకో కార్యక్రమంలో అనుబంధసంఘాలు, ప్రజాసంఘాలను కూడా భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ భేటీలో పాల్గొన్న వారిలో ఎఐటియుసి నాయకులు ఓబులేషు, సిఐటియు నాయకులు సిహెచ్‌ నరసింగరావు, ఐఎఫ్‌టియు నాయకులు కె పోలారి, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ఐఎఫ్‌టియు నాయకులు పి ప్రసాద్‌ ఉన్నారు.

  • దీక్షలలో వీరే

ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు)

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, ఎస్‌. వాణిశ్రీ, రేఖా ఎలిజబెత్‌, టి గజలక్ష్మీ, రేణుక, కారం రామలక్ష్మీ, ఎం భూదేవి, జి కృపావరం

ఎఐటియుసి అనుబంధ సంఘం

ఇ సరళాదేవి, ఎన్‌ సరోజనమ్మ, వెంకట సుబ్బమ్మ, జె చంద్రకళ

ఐఎఫ్‌టియు అనుబంధ సంఘం

వి ఆర్‌ జ్యోతి, జి భారతి, జె గంగాదేవి

➡️