టిడ్కో ఇళ్ల పంపిణీలో దగా

Feb 14,2024 21:57 #Housing, #Nellore District, #Protest
angree on tidco houses distribution

-భారీగా తరలచ్చిన జనం… నిరాశతో వెనక్కి

-పట్టా చించేసిన లబ్ధిదారుడు నిరసన

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి: టిడ్కో ఇళ్ల పంపిణీలో దగా పట్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక లబ్ధిదారుడు తనకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాను చింపివేసి నిరసన తెలిపారు. నెల్లూరు నగరం పరిధిలో ఆరు చోట్ల రూ.900 కోట్లతో 15,552 టిడ్కో ఇళ్లను నిర్మించారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనే ఈ ఇళ్లు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. అప్పట్లోనే కొందరి లబ్ధిదారులకు ఇంటి తాళాలను అధికారులు అందజేశారు. ఆ తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఇళ్లను తమకు అప్పగించాలని లబ్ధిదారులు గత నాలుగన్నర సంవత్సరాల నుంచి కోరుతున్నారు. లబ్ధిదారులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. అయినా, ప్రభుత్వం స్పందించలేదు. ఎన్నికల సమీపిస్తుండడంతో పనులు పూర్తి చేయకుండానే టిడ్కో గృహాల పంపిణీని తూతూమంత్రంగా బుధవారం చేపట్టారు. నెల్లూరు నగరంలోని ఆరు ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులను అల్లీపురం టిడ్కో ఇళ్ల వద్దకు అధికారుల, వైసిపి నాయకులు రప్పించారు. ఇంటి పట్టాలతోపాటు తాళాలూ అందిస్తారనే నమ్మకంతో వేలాది మంది లబ్ధిదారులు ఉదయం ఎనిమిది గంటలకే తరలివచ్చారు. మంత్రులు ఆదిమూలం సురేష్‌, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుదీర్ఘ ఉపన్యాసం తరువాత ఇద్దరు, ముగ్గురికి మాత్రమే పట్టాలిచ్చి, తాళాలు అందించి ఫొటోలు తీయించుకొని అక్కడి నుంచి మంత్రులు వెళ్లిపోయారు. మిగిలిన వారికి పట్టాలు ఇవ్వలేదు. గంటల కొద్దీ నిరీక్షించిన పట్టాలు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇళ్లు నిర్మిస్తే, వాటి పంపిణీలో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారని, ఇప్పుడు పిలిచి పట్టాలు ఇవ్వకుండా మాటలు చెబుతున్నారని, పేదలను రాజకీయాలకు, ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారని ఆవేదన చెందారు. ఓ లబ్ధిదారుడు వేదికపైకి వచ్చి తనకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాను చించివేశారు. తనకు ఇళ్లు వద్దు, ఏమీ వద్దంటూ నిరసన తెలిపారు. అధికారులు నివారిస్తున్నా పట్టించుకోలేదు. సమావేశానికి వచ్చిన లబ్ధిదారులందరూ నిరాశగా వెనుదిరిగారు.

➡️