మార్చి 15 నుంచి డిఎస్‌సి

YV Subbareddy's comments on joint capital were distorted
  •  30 వరకు పరీక్షలు
  • నోటిఫికేషన్‌ విడుదల చేసిన మంత్రి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గానూ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్‌సి-2024కు నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలోని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్‌సి-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ డిఎస్‌సి ద్వారా 2,280 ఎస్‌జిటి పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు 2,299, టిజిటిలు 1,264, పిజిటిలు 215, ప్రిన్సిపల్స్‌ 42 పోస్టులు కలిపి మొత్తం 6,100 ఉపాద్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులకు సంబంధించిన ఫీజులను ఈ నెల 12 నుంచి 21 వరకు చెల్లించవచ్చని తెలిపారు. భర్తీ చేసిన దరఖాస్తులను ఈ నెల 22 వరకు తీసుకుంటామని అన్నారు. మార్చి 5 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్‌, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ ద్వారా పరీక్షను నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 122 కేంద్రాల్లో డిఎస్‌సి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, ఏప్రిల్‌ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఏప్రిల్‌ 2న ఫైనల్‌ కీ విడుదల చేసి ఏప్రిల్‌ 7న డిఎస్‌సి -2024 ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. 2018 సిలబస్‌ ప్రకారమే డిఎస్‌సి పరీక్షలు వుంటాయన్నారు. జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా, రిజర్వ్‌ కేటగిరి అభ్యర్థులకు మరో ఐదేళ్లు గడువు ఎక్కువ అని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, పాఠశాల విద్యా కమిషనర్‌ సురేష్‌కుమార్‌ మాట్లాడారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలున్నా, ఫిర్యాదులు చేయాలన్నా 9505619127, 9705655349 నెంబర్లకు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ  https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

➡️