సర్పంచుల ప్రత్యక్ష కార్యాచరణ

Dec 28,2023 09:52 #YCP Failures, #YCP Govt
ap sarpanch protest

జనవరి ఒకటి నుంచి సభలు, సమావేశాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పంచాయతీరాజ్‌ చట్టానికి సచివాలయ వ్యవస్థ తూట్లు పొడిచిందన్న ప్రచారం నేపథ్యంలో వాటి విలీనం జరుగుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సచివాలయ వ్యవస్థ పంచాయతీల ఉసురుతీస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని రద్దు చేయాలని వైసిపి తరపున గెలిచిన సర్పంచులు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సచివాలయ వ్యవస్థను విలీనం చేయాలని కోరుతూ సర్పంచులు పోరాటాలు చేసినా ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది. పంచాయతీల అధికారులు, విధులు, నిధులన్నీ ప్రభుత్వం నేరుగా లాగేసుకుంటుండటంతో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారారు. చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచులు అధికారాలు చెలాయించలేని పరిస్థితి నెలకొంది. తమ గ్రామాలకు కావాల్సిన నిధులనూ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామ సచివాలయ వ్యవస్థపై సర్పంచులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఉద్యమాలు చేపట్టారు. పంచాయతీల కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితి చాలా చోట్ల నెలకొంది. రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు సమాంతర వ్యవస్థ అయిన సచివాలయాలను విలీనం చేయాలని, తమకే అధికారాలు అప్పగించాలని డిమాండ్‌ను సర్పంచులు తెరపైకి తెస్తున్నారు. దీంతోపాటు పలు డిమాండ్లతో జనవరి ఒకటి నుంచి సమర శంఖారావం పేరుతో సభలు ఏర్పాటుచేసి తమ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎంపిపి, జెడ్‌పిటిసిలకు రూ.30 వేలు, సర్పంచులు, ఎంపిటిసిలకు రూ.15 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యుత్‌ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని, నిధుల మళ్లింపును నిలుపుదల చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,918 మంది సర్పంచులు రాజకీయ పార్టీలకు అతీతంగా పంచాయతీలకు జరుగుతున్న అన్యాయాలను వివరించాలని నిర్ణయించారు.

➡️