ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతల అరెస్టు

– రాజనాథ్‌సింగ్‌ను అడ్డుకుంటారన్న కారణంతో నిర్బంధానికి దిగిన ప్రభుత్వం
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కూర్మన్నపాలెం కూడలిలో 1168 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలపై ప్రభుత్వం అరెస్టులకు దిగింది. బుధవారం అనకాపల్లిలో బిజెపి ఎన్నికల సభలో పాల్గనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ వస్తున్న దృష్ట్యా ఆయనను అడ్డుకుంటారన్న అనుమానంతో పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగించారు. 11 మందిని అరెస్టు చేసి గాజువాక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎప్పటిలాగే బుధవారమూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు దీక్షల్లో కూర్చున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులు దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టారు. పోరాట కమిటీ నాయకులు చెబుతున్నది వినకుండా పోలీసు వాహనాలు ఎక్కించి గాజువాక స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పోరాట కమిటీ నేతలు యు.రామస్వామి, ఎం రాజశేఖర్‌, రామకృష్ణ, శ్రీనివాసరాజు తదితరులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్‌ గడ్డు పరిస్థితుల్లో ఉందని తెలిపారు. గంగవరం పోర్టులో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన మూడు లక్షల 33 వేల టన్నుల కోకింగ్‌ కోల్‌ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం బగ్గు వాడటం వల్ల బ్లాస్ట్‌ ఫర్నేస్‌ సర్వనాశనమైందని తెలిపారు. పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షిస్తామని చెబుతున్న రాజకీయ నేతల మాటలు బూటకమని అన్నారు. కర్మాగారాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరించారు. బిజెపి నాయకుల కల్లబల్లి మాటలు నమ్మే పరిస్థితిలో కార్మికులు లేరని, వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓటమి తప్పదని అన్నారు.
అరెస్టులను ఖండిస్తూ నిరసనలు
పోరాట కమిటీ నాయకుల అరెస్టులను ఖండిస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన ద్వారం వద్ద పోరాట కమిటీ, అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండిస్తూ పెద్దపెట్టున నినదించారు. అక్రమ అరెస్టులను సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి, ఆ పార్టీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ఓ ప్రకటనలో ఖండించారు. బిజెపితో రాష్ట్ర వైసిపి ప్రభుత్వం అంటకాగుతూ ఉక్కు పోరాట నాయకులపై పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించడం దుర్మార్గమని పేర్కొన్నారు.

➡️