యువగళం పాదయాత్ర ముగింపు సభలోఎన్నికల శంఖారావం పూరిస్తాం

Dec 11,2023 20:03 #Atchannaidu, #press meet, #Tdp Leader
  • చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ హాజరవుతారు : అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం జిల్లా):నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో ఎన్నికల శంఖారావం పూరిస్తామని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్‌లో సోమవారం భూమిపూజ నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు యువగళం పాదయాత్ర ముగింపు సభ ఐదు లక్షల మందితో నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ హాజరవుతారని తెలిపారు. ఈ సభను విశాఖలోని ఎయు గ్రౌండ్‌లో నిర్వహించేందుకు ఇన్‌ఛార్జి వైస్‌ఛాన్సలర్‌కు లేఖ రాశామని, అనుమతి ఇస్తామని ముందు చెప్పి, వైసిపి ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో ఆ రోజు ఆర్గానిక్స్‌ డే నిర్వహిస్తామని అనుమతి ఇవ్వలేమని చెప్పారని వివరించారు. ప్రస్తుతం భూమాత లేఆవుట్‌ యాజమాన్యం స్థలం ఇచ్చిందని, వారిపైనా వైసిపి వారు ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. అయినా, యాజమాన్యం తమకు సహకరించి సభకు స్థలం ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం బస్సులు కావాలని ఆర్‌టిసి ఎమ్‌డికి లేఖ రాస్తామన్నారు. వారు నిర్ణయించే రేటు ప్రకారం బస్సులకు అద్దె చెల్లిస్తామని చెప్పారు. బస్సులు ఇవ్వకుండా ఇబ్బందిపెడితే, వంద రోజుల్లో వచ్చేది తమ ప్రభుత్వమేనని, వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టిడిపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు కళా వెంకటరావు, కేంద్ర మాజీ మంత్రి ఆశోక్‌ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️