దర్యాప్తు వేగవంతం చేయండి

  • జగన్‌పై దాడి కేసులో సిఇఓ ఆదేశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి సంఘటనలో దర్యాప్తును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. సోమవారం ఆయన ఐజి రవిప్రకాష్‌, విజయవాడ సిపి కాంతిరాణాటాటాలతో సమావేశమైనారు. సచివాలయంలోని సిఇఓ ఛాంబర్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సంఘటన జరిగిన తీరుపై అధికారులను ఆరా తీశారు.సంఘటన ఏ విధంగా చోటుచేసుకుంది? దాడి చేసేందుకు నిందితులకు ఏ విధంగా అవకాశం లభించింది? పూర్తి స్ధాయిలో బందోబస్తు ఉన్నప్పటికీ రాయితో ఎలా దాడి చేయగలిగారు? ఘటనకు సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితుల విచారణ ఏ విధంగా సాగుతోంది? విచారణలో ఏమైనా విషయాలు బయట పడ్డాయా? అన్న అంశాలపై ఆరా తీశారని సిఇఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బ సిఎంతో పాటు ఇతర ప్రముఖ వ్యక్తుల పర్యటనల్లో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా సిఎంపై దాడి సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలు, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు ప్రగతిని వీడియో విజువల్స్‌, ఫోటోల ద్వారా విజయవాడ నగర పోలీస్‌ కమిషనరు కాంతిరాణాటాటా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌మీనాకు వివరించారు.

ప్రోటోకాల్‌లో భాగమే.. కరెంటు నిలిపివేతపై సిపి
ప్రోటోకాల్‌లో భాగంగానే ముఖ్యమంత్రి పర్యటనలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు విజయవాడ సిపి కాంతిరాణా టాటా తెలిపారు. సిఇఓతో భేటీ అనంతరం సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోమాట్లాడుతూ సిఎం భద్రత కోసం కరెంట్‌ తీయడమనేది సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో భాగమేనని ఆయన చెప్పారు. యాత్ర జరిగిన మార్గంలో కరెంటు వైర్లు, కేబుల్‌ వైర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో అన్ని రకాల తీగలు తొలగించడం సాధ్యం కాదని అన్నారు. యాత్రకు ఒకరోజు ముందే కేబుల్‌ వైర్లను తొలగించామని అన్నారు. విద్యుత్‌ వైర్లు తగిలేలా ఉండటంతో భద్రత దృష్ట్యా కరెంటు సరఫరా నిలిపివేశామన్నారు. ఈ ఘటనపై 8ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి భద్రత కోసం ఎపిఎస్‌పి నుంచి నాలుగు ప్లాటూన్లతో పాటు ఆక్టోపస్‌, సిఎం సెక్యూరిటీ కూడా ఉందన్నారు. మొత్తం మీద యాత్రకు బందోబస్తు కోసం 1480 మంది సిబ్బందిని వినియోగించడం జరిగిందన్నారు. ఓ వ్యక్తి సింగ్‌నగర్‌లో బలంగా సిఎంపైకిరాయి విసిరాడని, ఇందుకు సంబంధించి దుండగుడు రాయి విసిరాడని భావిస్తున్న స్కూల్‌ భవనంలో ఉన్నట్లు భావిస్తున్న 40, 50మందిని ప్రశ్నించామని చెప్పారు. ఒక వ్యక్తి రాయి విసిరాడనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎయిర్‌గన్‌తో కొట్టాడా, చేతితో విసిరాడా అనేది తెలియాల్సి ఉందన్నారు.

రూ.2లక్షల నజరానా
సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించిన ఘటనలో నిందితులకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందించిన వారికి రెండు లక్షల రూపాయల నగదును నజరానాగా అందిస్తామని విజయవాడ పోలీసులు ప్రకటించారు. నిందితులకు సంబంధించి సమాచారంతో పాటు సెల్‌ఫోన్‌, వీడియో రికార్డింగ్స్‌ తమకు అందించాలని పోలీసులు విజ్ఞపి చేశారు. ప్రత్యక్ష సాక్షులు కూడా నేరుగా తమకు సమాచారమందించవచ్చని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం అందించదలచిన వారు ఎన్‌టిఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ డిసిపి కంచి శ్రీనివాసరావు, ఫోన్‌ నెంబరు 9490619342, ఎడిసిపి టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ శ్రీహరిబాబు, కమిషనర్స్‌, టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జిరోడ్డు, పశువుల ఆసుపత్రి పక్కన , లబ్బీపేట, కృష్ణలంక , విజయవాడకు తెలియజేయాలని కోరారు.

➡️