ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమించండి : మంత్రి బొత్స

ప్రజాశక్తి-మెరక ముడిదాం (విజయనగరం): ప్రభుత్వంపై నమ్మకముంచి అంగన్‌వాడీలు సమ్మె విరమించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. అంగన్‌వాడీల డిమాండ్లలో పదింటికి ప్రభుత్వం అంగీకరించిందని, సమ్మె కాలంలో జీతాలూ ఇస్తామని చెప్పారు. ఎన్నికల ముందు జీతాలు పెంచడం సరికాదని, రెండు నెలలు ఆగితే వెయ్యి కాదు రెండు వేలు ఇస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం సోమలింగా పురంలో డిసిఎంఎస్‌ మాజీ చైర్మన్‌ సిరివురూ వెంకట రమణరాజు ఇంటికి కనుమ పండగ సందర్భంగా మంగళవారం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ చీపురపల్లి ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అంగన్‌వాడీ నాయకులు పి మాలతితో పాటు పలువురు కార్యకర్తలు మంత్రిని కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ప్రభుత్వం మీ సమస్యలపై సానుకూలంగా ఉందన్నారు. పెద్ద మనసుతో గర్బిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు అందిస్తున్న సేవలను అందించాలని కోరారు.

➡️