అసెంబ్లీ పరిధిలోనే అరకు ప్రచార అనుమతులు

Apr 28,2024 21:56 #cpm, #prakatana

ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షణాధికారికి సిపిఎం వినతిపత్రం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :అరకు పార్లమెంటు ఎన్నికల ప్రచార అనుమతులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇప్పించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షణాధికారి రామ్‌మోహన్‌ మిశ్రాను ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె జయరాం విజయవాడలో ఆదివారం కలిసి వినతిపత్రం అందించారు. అరకు(ఎస్టి) లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి తమ పార్టీ అభ్యర్ధిగా పాచిపెంట అప్పలనర్స పోటీ చేస్తున్నారని తెలిపారు. లోకల్‌ మండలాల పరిధిల్లో ప్రచార వాహనాలు(జీపులు) అనుమతి కోసం అరకువేలి రిటర్నింగ్‌ అధికారికి, పాడేరు నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారికి ప్రచార వాహనాల కోసం సువిధ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని వివరించారు. ఎంపి అభ్యర్ధి ప్రచార అనుమతులు పార్వతీపురంలోనే తీసుకోవాలని అరకువేలి రిటర్నింగ్‌ అధికారి చెప్పారని పేర్కొన్నారు. అరకువేలి, పాడేరు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార వాహనాలు ఇతర అనుమతుల కోసం పార్వతీపురం వెళ్లి అనుమతి తీసుకోవాలంటే సాధ్యం కాని పరిస్థితి అని వివరించారు. గిరిజన ప్రాంతంలో అంతదూరం వెళ్లడం వ్యయ ప్రయాసలతో కూడిన సమస్య అని తెలిపారు. కావున పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ అనుమతులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారులు ఇచ్చేలా తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల కమిషన్‌ దృష్టికెళ్లిన విషయాలపై అధికారులు సానుకూలంగా స్పందించారని వై వెంకటేశ్వరరావు, జయరాం మీడియాతో తెలిపారు.

➡️