పనికిమాలిన చట్టమని బిజెపితో చెప్పించగలరా?

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుకు అసెంబ్లీలో మద్దతిచ్చిన టిడిపి
ఇప్పుడు దుష్ప్రచారం తగదు : సజ్జల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును శాసనసభ, శాసనమండలిలో మంచి చట్టం అని స్వాగతించి, ఇప్పుడు రాజకీయాల కోసం టిడిపి దుష్ప్రచారానికి పూనుకోవడం తగదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెబితేనే చట్టం తీసుకొచ్చామని, చంద్రబాబుకు చిత్తశుద్ధి వుంటే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు పనికిమాలిన చట్టమని బిజెపితో ప్రకటన చేయించగలరా? అని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన మోడీ, అమిత్‌ షాలతో ఎందుకు ప్రకటన చేయించలేదని అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 జులై 29న శాసనసభలో టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుకు మద్దతు ఇస్తూ ఇది మంచి చట్టమని స్వాగతించారని అన్నారు. రిజిస్ట్రేషన్‌లలో స్టాంప్‌ పేపర్స్‌ విధానాన్ని రద్దు చేసి ఇ-స్టాంపింగ్‌ విధానాన్ని చంద్రబాబు హయాంలోనే 2016-17లో ప్రారంభమైందన్నారు. తన హయాంలో ప్రారంభమైన ఇ-స్టాంపింగ్‌ విధానాన్ని ఇపుడు చంద్రబాబు జెరాక్స్‌ కాపీలు అంటున్నారని విమర్శించారు. బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌ ఇటీవల ఇ-స్టాంపింగ్‌ విధానంలోనే భూములను కొన్నారని, చంద్రబాబు చెప్పేది నిజమైతే వారి ఇ-స్టాంపింగ్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలను చించేయాలని డిమాండ్‌ చేశారు.
ఎలాగైనా గెలవాలని టిడిపి కూటమి చేస్తున్న కుట్రలకు వంత పాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సైంధవ పాత్ర పోషిస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. సిఎం జగన్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసిపి లీగల్‌ సెల్‌ అధ్యక్షులు ఎమ్‌ మనోహర్‌రెడ్డి విమర్శించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తూ పత్రికలకు ప్రకటనలు ఇచ్చిన టిడిపి కూటమిపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు వైసిపి గ్రీవెన్స్‌సెల్‌ కన్వీనర్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్‌ సెల్‌ నాయకులు శ్రీనివాసరెడ్డి కలిసి సిఇఒ ఎంకె మీనాకు వినతిపత్రం అందజేశారు.

➡️