సిపిఎం నేతలపై కేసు కొట్టివేత

Dec 15,2023 09:41 #against, #Case, #cpm leaders, #dismissed

ప్రజాశక్తి – విజయవాడ : కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన సిపిఎం నేతలపై పెట్టిన అక్రమ కేసును గురువారం విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు కొట్టివేసింది. ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న కార్మికులు,పేదలకు ప్రభుత్వం సహాయం చేయాలని, భోజన ఏర్పాట్లు చేయాలని కోరుతూ విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్‌లో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సిపిఎం నేతలు నిరసన తెలిపారు. నిరసనలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణారావు, నగర కమిటీ సభ్యులు సిహెచ్‌.శ్రీనివాస్‌, స్థానిక నాయకులు పిఎస్‌ఎన్‌.మూర్తిపై పోలీసులు 2020 ఆగస్టు 20న అక్రమంగా కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 188, 143, ఆర్‌/డబ్ల్యు149 ఐపిసి, సెక్షన్‌ 30 యాక్ట్‌, 144 సిఆర్‌పిసి, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన తదితర సెక్షన్లు పెట్టారు. విచారణ అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ కేసులో సిపిఎం నేతల తరపున సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ సిపిఎం నేతలు, ప్రజాసంఘాల కార్యకర్తలపై ప్రభుత్వం పెట్టిన అనేక అక్రమ కేసులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

➡️