విశాఖ ఉక్కులో సిబిఐ దాడులు

Apr 20,2024 08:59 #CBI raids, #visakhapatnam

– నాసిరకం బగ్గు కొనుగోలుపై 2023లోనే సిపిఎం ఫిర్యాదు
ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో :గడచిన 3 సంవత్సరాలుగా విశాఖ ఉక్కును కేంద్రంలోని బిజెపి సర్కారు వివాదాల మయంగా మార్చేసింది. ప్లాంట్‌లోని విభాగాలన్నింటినీ ఇప్పటికే నిర్వీర్యం చేసింది. 2023 ఫిబ్రవరిలో సుమారు రూ.45 కోట్ల విలువైన నాసిరకం బగ్గును యాజమాన్యం కొనుగోలు చేసింది. నాసిరకం బగ్గు కొనుగోలుకు సంబంధించి భారీగా కుంభకోణం జరిగిందని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ మల్లికార్జునకు, విశాఖపట్నంలోని సిబిఐ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఐదుగురు అధికారులతో కూడిన సిబిఐ బృందం శుక్రవారం స్టీల్‌ప్లాంట్‌లో దాడి చేసింది. రూ.45 కోట్ల విలువైన 16 వేల టన్నుల జమ్‌కోల్‌ను అత్యవసరం అంటూ ఉక్కు చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయిలో అప్పట్లో కొనుగోలు చేశారు. ఈ బగ్గును మంచిరకం బగ్గులో కలిపి వాడేసిందని అప్పట్లో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సమాచారం సిపిఎం విశాఖ జిల్లా నేతల దృష్టికి రావడంతో జిల్లా కలెక్టర్‌, సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో దేశంలోగల పేరెన్నికగన్న లేబరేటరీల్లో ఈ బగ్గు నమూనాలను పరీక్షించారు. నాశిరకం బగ్గు అని తేలడంతో సిబిఐ అధికారులు తాజాగా ప్లాంట్‌లోకి వెళ్లారు. స్టీల్‌ యాజమాన్యం రూ.45 కోట్లను ప్రయివేట్‌ పార్టీ యాజమాన్యానికి చెల్లించిందని రూఢ అయ్యింది. దీంట్లో భారీ అవినీతే చోటుచేసుకున్నట్లు సిబిఐ అధికారులు అనుమానించి ఈ కోణం నుంచి దర్యాప్తు అనంతరం తేల్చారు. దీంతో ఒక్కసారిగా ప్లాంట్‌లో సోదాలు చేపట్టారు. ప్రధాన భాగస్వామిగా స్టీల్‌ప్లాంట్‌ సిఎండి భట్‌ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో సిబిఐ అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది.

➡️