ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి : సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లాల ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడంతోపాటు ప్రతిరోజూ నివేదికలను పంపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్‌ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఇఒ మాట్లాడుతూ.. ప్రతిరోజూ నివేదికలను ఇసిఐకి పంపించాల్సి ఉంటుందని అన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని, కార్యాలయాల్లో కానీ, పోస్టాఫీసుల్లో కానీ ఎపిక్‌ కార్డులు ఏమాత్రం పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. సి-విజిల్‌ ఫిర్యాదులను సంతృప్తికర స్థాయిలో డిఇఒలు పరిష్కరిస్తున్నారని ఆయన అభినందించారు. నగదు, లిక్కరు వంటి వాటి అక్రమ రవాణాను నియంత్రించడం, స్వాధీనం చేసుకోవడంలోనూ మంచి ప్రగతిని కనబరుస్తున్నారన్నారు. కోనసీమ, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి వంటి జిల్లాలు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. కౌంటింగ్‌ సెంటర్లకు పరిశీలకులను నియమించే విషయంలో ఇసిఐ మార్గదర్శకాలు పాటించాలని సిఇఒ ఆదేశించారు. అదనంగా కావాల్సిన పరిశీలకులు, ఎఆర్‌ఒల ప్రతిపాదనలను సాధ్యమైనంత త్వరితగతిన పంపాలని, పోలింగ్‌ ప్రక్రియ, కేంద్రాలు, వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా గరిష్ట స్థాయిలో కవర్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సిఇఒ పి కోటేశ్వరరావు, జాయింట్‌ సిఇఒ ఎ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఇఒ కె విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
పోలింగ్‌ రోజు, పోలింగ్‌కు ముందు రోజు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎమ్‌సిఎమ్‌సి కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్‌ మీడియాలో ఎలాంటి ప్రకటనలను ప్రచురించకూడదని ఐఅండ్‌పిఆర్‌ కమిషనరు తుమ్మా విజరుకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతంలో ప్రింట్‌ మీడియాలో అభ్యంతరకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వార్తా పత్రికలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రకటనల విషయంలో ఎమ్‌సిఎమ్‌సి కమిటీల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే మీడియాలో ప్రకటనలు ప్రచురించి కమిషన్‌కు సహకరించాలని కోరారు.

➡️