చట్ట సభలకు ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోండి- ఊరూరా సిపిఎం ప్రచారం

May 8,2024 22:44 #cpm pracharam

ప్రజాశక్తి- యంత్రాంగం :నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పాలకపక్షాలను ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక అయిన ఉద్యమ నేతలను చట్ట సభలకు ఎన్నుకోవాలని కోరుతూ సిపిఎం నేతలు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి, టిడిపి, వైసిపి పార్టీల విధానాలను ప్రజల్లో ఎండగట్టారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, భామిని మండలాల్లో అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్సకు మద్దతుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి ప్రచారం నిర్వహించారు. సింగనవలసలో ఉపాధి కార్మికులతో మాట్లాడారు. బిజెపి అవలంభిస్తోన్న విధానాలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగం, చిల్లర వర్తకం పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందన్నారు. రాష్ట్రానికి గుండెకాయలాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మకానికి పెట్టిందన్నారు. బిజెపిని, దాని పొత్తు, తొత్తు పార్టీలను ఓడించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గిరిజనుల అభివృద్ధికి, గిరిజన హక్కుల రక్షణకు, అటవీ భూముల రక్షణకు సిపిఎం కృషి చేస్తోందన్నారు. అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని కోరారు. కురుపాం, కొమరాడ మండలాల్లో కురుపాం అభ్యర్థి మండంగి రమణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్‌ ముజఫర్‌ నగర్‌లో పాణ్యం అభ్యర్థి డి గౌస్‌దేశారు చేపట్టిన ఎన్నికల ప్రచారంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ పాల్గన్నారు. వారి ప్రచారానికి ప్రజానీకం నుంచి మంచి ఆదరణ లభించింది. స్థానికులు తమ సమస్యలను నాయకుల వద్ద ప్రస్తావించారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ ఈ కాలనీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు తాగునీరు, డ్రెయినేజీ వంటి సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి, నియోజవర్గ అభివృద్ధికి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
విజయవాడలోని 58, 59, 60, 61, 62, 63, 64 డివిజన్లలో సిపిఎం సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు, కాంగ్రెస్‌ విజయవాడ ఎంపి అభ్యర్థి వల్లూరు భార్గవ్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో మోడీ పెత్తనాన్ని ఎదుర్కోవాలంటే కమ్యూనిస్టులను, కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. నిత్యం ఘర్షణలతో రెచ్చగొడుతున్నహొ వెలంపల్లి, బోండాలకు బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాజధాని అమరావతి నిర్మాణం, విశాఖ ఉక్కు తదితర అంశాలపై సమాధానం చెప్పలేక ప్రధాని మోడీ అయోధ్య రామాలయం అంశాన్ని ముందుకు తేవడం శోచనీయమన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని సత్యనారాయణ పురం, జాకీర్‌ హుస్సేన్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో అభ్యర్థి మూలం రమేష్‌ ఎన్నికల ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. అటువంటి పార్టీకి వైసిపి, టిడిపి, జనసేన మద్దతు ఇవ్వడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసిన ఈ పార్టీలకు ఓటు అడిగి హక్కు లేదన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్‌ పరిధిలోని కుంచనపల్లిలో మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జన్న శివశంకరరావు ప్రచారం నిర్వహిస్తూ.. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సమస్యలపై, రైతాంగ, కార్మిక సమస్యలపై నిరంతరం వామపక్ష పార్టీలు పోరాడుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తనను గెలిపించాలని కోరారు.

విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధిలోని అగనంపూడి పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ప్రచారం చేశారు. తాను గెలిస్తే స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు, అగనంపూడి టోల్‌గేట్‌ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో రంపచోడవరం అభ్యర్థి లోతా రామారావు ప్రచారం చేశారు. రామారావు, అప్పలనర్సను గెలిపించాలని కోరుతూ దేవీపట్నం, విఆర్‌.పురం, వై.రామవరం మండలాల్లో సిపిఎం నాయకులు ప్రచారం నిర్వహించారు. చింతూరు మండల కేంద్రంలోని సంత మార్కెట్‌లో కరపత్రాలు పంపిణీ చేశారు. చిడుమూరు గ్రామంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్సకు మద్దతుగా డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు.

➡️