అవినాష్‌ ఏ తప్పూ చేయలేదని నమ్మబట్టే టికెట్‌ ఇచ్చా

Apr 26,2024 08:29 #ap cm jagan, #nomination, #pulivendula

-కూటమి కుట్రలకు సహకరించే వారా వైఎస్‌ఆర్‌ వారసులు?
-పసుపు మూకలతో చెల్లెమ్మలు చేతులు కలపడం దుర్మార్గం
-కడప, పులివెందుల బ్రాండ్లను చెరిపేయాలనునే వారికి గుణపాఠం చెప్పాలి
-పులివెందుల సభలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌
-ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌
ప్రజాశక్తి- కడప ప్రతినిధి, పులివెందుల టౌన్‌/రూరల్‌:కడప వైసిపి అభ్యర్థి వైఎస్‌.అవినాష్‌రెడ్డి ఏ తప్పూ చేయలేదని నమ్మబట్టే టికెట్‌ ఇచ్చానని, మాలో అందరి కంటే చిన్నోడి జీవితం నాశనం చేయాలని చూడడం దారుణమని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్టి పేర్కొన్నారు. గురువారం ఆయన పులివెందుల సిఎస్‌ఐ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. జలయజ్జం, ఉచిత విద్యుత్‌, 108, 104, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఇంగ్లీష్‌ మీడియం నాడు-నేడు కింద పాఠశాలలు, ఆస్పత్రులు, చేయూత, ఆసరా, సురక్ష, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. వివక్షలేని పాలన చేశానన్నారు. ఇలాంటి సంక్షేమ పాలన గిట్టని పసుపు మూకలతో చెల్లెమ్మలు చేతులు కలపడం దుర్మార్గమని పేర్కొన్నారు. నోటాకు కూడా రాని ఓట్లు కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో చేరి వైఎస్‌ఆర్‌ వారసులమనే పేరుతో ముందుకు రావడం కుట్రలో భాగం కాదా? అని ప్రశ్నించారు. రాష్టాన్ని అన్యాయంగా చీల్చి, ప్రత్యేక హోదాను ఇవ్వని కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎవరికి లాభమో ఆలోచించాలని, చనిపోయిన నాన్న పేరు సిబిఐ ఛార్జిషీట్‌లో చేర్చిందెవరో చెప్పాలని అన్నారు. వైఎస్‌ఆర్‌ పేరు చెరిపేసి ఆయన కుటుంబాన్ని అణగదొక్కాలని కుట్రలు పన్నిందెవరని నిలదీశారు. దేశంలోని అన్ని వ్యవస్థల్నీ ప్రయోగించిన కాంగ్రెస్‌, టిడిపిలతో కలవడం దారుణమని, వైఎస్‌ఆర్‌పై దాడి చేసిన వారితో కలిసి పసుపు చీర కట్టుకుని వారికి మోకరిల్లడం శోచనీయమని అన్నారు. ఇలాంటి వారికి ఓటేస్తే కుట్రలకు వేసినట్లే అవుతుందని పేర్కొన్నారు. తనపై బురద జల్లేందుకు ఎవరు పంపించారో, వారి వెనుక ఎవరు ఉన్నారో తెలుస్తోందన్నారు. చిన్నాన్న వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడమేమిటని ప్రశ్నించారు. చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం దిగజారుడు రాజకీయం కాదా? అని నిలదీశారు. చిన్నాన్నకు రెండో భార్య ఉందనేది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆయనను చంపిన వారికి ఎవరు మద్దతు ఇస్తున్నారో అందరికీ తెలుసన్నారు. 14 ఏళ్ల టిడిపి పాలనలో జగన్‌ కంటే మంచి చేశామని చెప్పగలరా? అని ప్రశ్నించారు. రూ.9,000 కోట్లతో జిఎన్‌ఎస్‌ఎస్‌-హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అనుసంధానంలో భాగంగా కాలేటివాగును పూర్తి చేశామన్నారు. గతంలో చిత్రావతిలో మూడు, నాలుగు టిఎంసిలు నిల్వ చేసేవారని, వైసిపి హయాంలో పది టిఎంసిలను, పైడిపాలెంలో ఆరు టిఎంసిలను నిల్వ చేశామని తెలిపారు. యురేనియం బాధిత గ్రామాలకు ఎర్రబల్లి పైప్‌లైన్‌ పనులు పరుగులు తీస్తున్నాయన్నారు. ఆగస్టు, జులై మాసాల్లో పులివెందులలో మెడికల్‌ కళాశాలను అంకితం చేస్తామని తెలిపారు. రూ.400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ వ్యవస్థ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. రూ.5,900 కోట్లతో పులివెందులలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని వివరించారు. నవరత్నాల కింద 94.4 శాతం మంది లబ్ధి పొందారని తెలిపారు. వైఎస్‌ఆర్‌, వైఎస్‌ జగన్‌, కడప, పులివెందుల పేర్లను చెరిపేయాలనే వాళ్లు జిల్లా, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకులన్నారు. అంతకుముందు వైసిపి ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ కూటమికి స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారని, వైసిపికి యువత, రైతులు, ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లని తెలిపారు.
రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేత
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పులివెందుల అసెంబ్లీ స్థానానికి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం విజయవాడ నుంచి పులివెందులకు చేరుకున్న ఆయనకు వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సిఎస్‌ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్‌ పాల్గన్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వెంకటేష్ణ్‌కు నామినేషన్‌ పత్రాలను అందించారు.

➡️