ఎన్నికల సిబ్బంది జాబితా తయారీ పూర్తి చేయండి

Feb 17,2024 08:42 #AP Assembly Election, #AP CEO

 కలెక్టర్లను ఆదేశించిన సిఇఒ మఖేష్‌కుమార్‌ మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రానున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్న సిబ్బంది జాబితా తయారీ పూర్తి చేయాలని కలెక్టర్లు, ఎస్‌పిలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఎన్నికల సిబ్బంది సంఖ్య ప్రాథమిక అంచనా కంటే 20 శాతం అదనంగా ఉండాలన్నారు. సచివాలయం నుంచి శుక్రవారం ఎన్నికల సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో సిఇఒ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది నిర్వహణ, ఓటర్‌ లిస్టుల తయారీ, ఓటరు కార్డుల పంపిణీ, పోలింగ్‌ స్టేషన్లలో కనీస వసతులు ఏర్పాటు, లా అండ్‌ ఆర్డర్‌ నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. పోలీస్‌శాఖలో సిబ్బంది కొరత ఉన్న జిల్లాలు అదనపు సిబ్బందిని సమకూర్చుకునే అవకాశాలపై వెంటనే రిపోర్టు సమర్పించాలన్నారు. పోలింగేతర విధులకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నెలాఖరు కల్లా పూర్తి చేసి ఎన్నికల విధుల్లో ఉండనున్న ప్రతి ఒక్క ఉద్యోగికీ పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెలాఖరులోగా సమస్యాత్మక ప్రాంతాల నివేదిక అందించాలని ఎస్‌పిలను ఆదేశించారు. జిల్లాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టుల విషయంలో ఆయా జిల్లాల ఎస్‌పిలు సమన్వయం చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ రూట్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. మేజర్‌ రూట్లతో పాటు మెయిన్‌ రూట్లలోనూ నిరంతరం పర్యవేక్షణ ఉండేలా మొబైల్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డిజి శంఖబత్ర బాగ్చి, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎంఎన్‌ హరీందర్‌ ప్రసాద్‌, ఉప ప్రధాన ఎన్నికల అధికారి కె విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

➡️