కార్పొరేట్-మతోన్మాద బిజెపిని ఓడించాలి

  • సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య

ప్రజాశక్తి మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్ మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం మంగళగిరి సిపిఎం కార్యాలయంలో సిపిఎం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఎం రవి అధ్యక్షతన జరిగింది. కృష్ణయ్య మన ప్రసంగాను కొనసాగిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బిజెపితో జతకట్టిన టిడిపిని, జనసేన పార్టీలను ఓడించాలని అన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతూ నిరంకుశంగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని అన్నారు. పార్లమెంట్లో సిఏఏ కు మద్దతు తెలిపిన టిడిపి, వైసిపి పార్టీల విధానాలను ఆయన విమర్శించారు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని అన్నారు. రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో నిత్యం ప్రజల కోసం పనిచేసే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనేక ప్రజా ఉద్యమాల్లో సిపిఎం పోరాటాలు నిర్వహించి అనేక సమస్యలను ఈ నియోజకవర్గంలో పరిష్కరించడం జరిగింది అని అన్నారు. అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు ఈ నియోజకవర్గంలో 20వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉండగా అధికారంలో ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీలు మోసం చేశాయని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ పార్టీలకు ఇళ్ల పట్టాల సమస్య, పేదల గురించి మాట్లాడి మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మంగళగిరి నియోజకవర్గం ఇండియా బ్లాక్ వేదిక అభ్యర్థి జొన్న శివశంకరరావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చెంగయా, ఈమని అప్పారావు, కే నలినీకాంత్, ఎన్ బావున్నారాయన, వై నేతాజీ, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిస్టీ, సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, మంగళగిరి, తాడేపల్లి పట్టణ కార్యదర్శులు వై కమలాకర్, బి వెంకటేశ్వర్లు, తాడేపల్లి మండలం రూరల్ కార్యదర్శి డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️