పోటీ చేసే స్థానాలపై సిపిఎం కీలక ప్రకటన

cpm annouce seats

ప్రజాశక్తి-విశాఖ : మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) కీలక ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తాము పోటీ చేసే స్థానాలను గుర్తించామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను గుర్తించినట్లు ప్రకటించారు. బుధవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఏపీలో ఇప్పటికే వైసిపి కొన్ని స్థానాలలో అభ్యర్ధులను ప్రకటించగా, టిడిపి-జనసేనలు తర్జనభర్జన పడుతున్న సమయంలో సిపిఎం ప్రకటనతో ఆయా స్థానాలపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో చెట్టాపట్టాలు వేసుకుంటూ టిడిపి, వైసిపి, జనసేనలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించాయి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ, ప్రత్యామ్నాయ ప్రజా ప్రణాళికను ఇప్పటికే సిపిఎం ప్రకటిస్తూ, పోరాటాలు చేస్తోంది. ఈ క్రమంలో 26 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో బరిలో దిగుతున్నట్లు ప్రకటించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి దశలో 9 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో సన్నాహాలు కూడా వారు ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికీ అభ్యర్థులను కూడా నిర్ణయించడం జరిగింది. బిజెపి పల్లకీ మోసే టిడిపి, వైసిపి, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎవరైనా తమతో కలిసి వస్తానంటే ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని సిపిఎం ప్రకటించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం సిపిఎంను సంప్రదిస్తే కాంగ్రెస్ తో కూడా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని సిపిఎం తెలిపింది. సిపిఎంకి మద్దతు ఇచ్చే లౌకిక, వామపక్ష శక్తులను గెలిపించాలని పిలుపునిచ్చింది.  వైఎస్ఆర్సీపీ, టిడిపిలలో ఎవరికి ఓటు వేసిన బిజెపికి వేసినట్టేనని సిపిఎం స్పష్టం చేసింది.

➡️