‘ఉక్కు’ పరిరక్షణలో వామపక్షాలు కీలక భూమిక : సిపిఎం

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకోవడంలో సిపిఎం, వామపక్షాలు కీలక భూమిక పోషించాయని సిపిఎం జగదాంబ జోన్‌ కార్యదర్శి ఎం.సుబ్బారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు శనివారానికి 1100వ రోజుకు చేరాయి. దీక్షల్లో ముఠా కార్మికులు, డివైఎఫ్‌ఐ నాయకులను ఉద్దేశించి సుబ్బారావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసే క్రమంలో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌నూ విక్రయించాలని నిర్ణయించుకుందని తెలిపారు. దానిని ప్రతిఘటించే పరిస్థితుల్లో వైసిపి ప్రభుత్వం లేకపోవడం, ప్రతిపక్షాలు బిజెపితో కలిసి వెళ్లడం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని అన్నారు. సిపిఎం, వామపక్షాలు మాత్రమే స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కట్టుబడి పోరాటాలు చేశాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షల్లో డివైఎఫ్‌ఐ నాయకులు కె.గణేష్‌, ఎల్లాజీ, శ్రీనివాస్‌, ముఠా కళాసీలు, సిఐటియు జగదాంబ జోన్‌ కార్యదర్శి కెవిపి.చంద్రమౌళి పాల్గొన్నారు.

➡️