హస్తం , కమలం ‘మధ్య’ పోరు

May 13,2024 06:53 #madyapradesh

-రేపు 8 స్థానాల్లో రాష్ట్రంలో తుది దశ పోలింగ్‌
– గిరిజన ఓటు బ్యాంకుతో కాంగ్రెస్‌
– హిందుత్వ రాజకీయాలతో కాషాయ పార్టీ
– సిట్టింగ్‌లను మార్చిన బిజెపి
-రాహుల్‌ జోడో యాత్ర ప్రభావం

మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ స్థానాలకుగాను 21 స్థానాలకు ఒకటి, రెండు, మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలు.. దేవాస్‌, ఉజ్జయిని, మందసోర్‌, రత్లామ్‌, ధార్‌, ఇండోర్‌, ఖర్ఘన్‌, ఖాండ్వా నియోజకవర్గాల్లో నాలుగో విడత మే13న ఎన్నికలు జరగనున్నాయి. హిందుత్వ రాజకీయాలతో బిజెపి, గిరిజన, ముస్లిం ఓటు బ్యాంకుపై ఆశతో కాంగ్రెస్‌ తలపడుతున్నాయి. గిరిజన ప్రాంతాల గుండా సాగిన రాహుల్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ధార్‌, ఖర్గావ్‌లలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం చేశారు.

ధార్‌: నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి రాధేశ్యామ్‌ మువెల్‌ పోటీ చేస్తుండగా, సిట్టింగ్‌ ఎంపి ఛస్రింగ్‌ ధర్బార్‌ను తప్పించి సావిత్రి ఠాకూర్‌ను బిజెపి బరిలోకి దింపింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎంపి గజేంద్ర సింగ్‌ బిజెపిలో చేరారు. బిజెపి మత రాజకీయాలకు తెరతీసింది. భోజ్‌షాలా ఆలయం, మసీదు ప్రాంగణంలో సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలని హైకోర్టులో వేసిన పిల్‌తో మళ్లీ హిందు, ముస్లింల మధ్య గొడవ రగులుకుంది. ఈ ప్రభావం ఎన్నికల మీద పడుతుందంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ గిరిజన, ముస్లిం ఓటు బ్యాంకు కలిగి ఉంది. ధార్‌ పరిధిలోగల అసెంబ్లీ స్థానాల్లో హస్తం గెలుపొందింది.
దేవాస్‌: ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి రాజేంద్ర మాలవియా, బిజెపి నుంచి సిట్టింగ్‌ ఎంపి మహేంద్రసింగ్‌ సోలంకి పోటీ పడుతున్నారు. బలారు, కుల ప్రాతిపదికన కేటాయింపు జరిగింది. మాలవీయ, సోలంకి ఇద్దరూ ఒకే సామాజిక తరగతికి చెందినవారే. సోలంకికి ఆర్‌ఎస్‌ఎస్‌ బలం లభించగా గత ఎన్నికల్లో గెలిచినా ఈసారి అధికార వ్యతిరేకత, గ్రామాల్లో ఉపాధి లేమి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఖర్గోన్‌: ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పోర్లాల్‌ ఖర్తే, బిజెపి నుంచి సిట్టింగ్‌ ఎంపి గజేంద్ర పటేల్‌ పోటీ చేస్తున్నారు. ఎస్టీ రిజర్వుడ్‌ సీటు కావడంతో గిరిజనుల ప్రాభల్యమెక్కువ.. ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ భావజాలాన్ని నూరిపోస్తోంది. హిందు, ముస్లింల మధ్య ఘర్షణలు చర్చనీయాంశమవుతున్నాయి. 2022లో రామనవమి తర్వాత జరిగిన అల్లర్లలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం బుల్డోజర్లతో ముస్లిం నివాసాలను, షాపులను కూల్చివేసింది. దాంతో ముస్లింలు బిజెపిని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ధార్‌, ఖర్గోన్‌ జిల్లాల్లో మోడీ పర్యటించారు.
ఉజ్జయిని: ఎస్సీ రిజర్వుడ్‌ సీటు ఉజ్జయినిలో కాంగ్రెస్‌ నుంచి మహేశ్‌ పర్మార్‌కు పోటీగా బిజెపి నుంచి సిట్టింగ్‌ ఎంపి ఫిరోజియా తలపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో 63 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బిజెపి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ క్షిప్రా నది అభివృద్ధి మరిచిందని, ఆ నదిని శుద్ధిచేసేంత వరకు పోరాడతానని కంకణం కట్టుకున్న మహేశ్‌కు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.

మందసార్‌: నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి దిలీప్‌ సింగ్‌ గుప్తా, బిజెపి నుంచి సుధీర్‌ గుప్తా పోటీపడుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గెలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ డీలా పడింది. ఇవిఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈసారి ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ చేసిన పాదయాత్రకు విశేష స్పందన కనిపించడంతో హస్తం శ్రేణులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్‌ పథకంపై యువత వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ వైపు యువత ఆశక్తి చూపుతున్నారు.
రత్లామ్‌: నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి కంతిలాల్‌ భురియా, సిట్టింగ్‌ ఎంపి గుమన్‌ సింగ్‌ను మార్చి అనిత నగర్‌ సింగ్‌ చౌహాన్‌కు బిజెపి టికెట్‌ ఇచ్చింది. రత్లామ్‌ కాంగ్రెస్‌ కంచుకోట. ఆ పార్టీకి చెందిన దిలీప్‌ సింగ్‌ భురియా, కాంతిలాల్‌ భురియాలే ఈ స్థానంలో గెలుస్తూ వచ్చారు. కానీ 2014లో దిలీప్‌ సింగ్‌ భురియా బిజెపిలో చేరి పోటీ చేసి గెలిచారు. అందుకే అక్కడ బిజెపి గెలిచింది.
ఖాండ్వాలో కాంగ్రెస్‌కు పట్టు ఉండేది. హస్తం రెబల్స్‌ బిజెపికి తావిచ్చారు. ఎమర్జెన్సీ తర్వాత జనసంఫ్‌ు, కాంగ్రెస్‌లో చీలికలు తెచ్చింది. రామజన్మభూమి వ్యవహారం బిజెపిని బలపరిచింది. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి నరేంద్ర పటేల్‌, బిజెపి నుంచి జ్ఞానేశ్వర్‌ పాటిల్‌ పోటీ చేస్తున్నారు.
ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం ఇండోర్‌లో చివరి క్షణంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షరు కాంతి బామ్‌ తన నామినేషన్‌ ఉపసంహరించుకుని బీజెపిలో చేరారు. దీంతో బిజెపి సిట్టింగ్‌ ఎంపి శంకర్‌ లల్వానీకీ గెలుపు ఖాయమైపోయినట్లే. కానీ బరిలో మరో 14 మంది అభ్యర్థులు ఉండటంతో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నోటాకు ప్రజలు ఓటేయాలని కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది.

ఎలక్షన్‌ డెస్క్‌

➡️