సిపిఎంతోనే గిరిజన హక్కులు, చట్టాలకు రక్షణ

Apr 18,2024 23:53 #cpm, #V.Srinivas rao
  • ఆదివాసీలకు నష్టం చేస్తున్న వారిని ఓడించండి
  •  అరకు ఎంపిగా అప్పలనర్సను గెలిపించండి : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అరకులోయ రూరల్‌ (అల్లూరి జిల్లా) : సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి గెలుపుతోనే గిరిజన హక్కులు, చట్టాలకు రక్షణ ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, కిల్లో సురేంద్ర, అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పి.అప్పలనర్స, అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, అనంతగిరి జడ్‌పిటిసి దీసరి గంగరాజు, సిహెచ్‌.చిన్నయ్య పడాల్‌లతో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం నుంచి అరకు పార్లమెంట్‌ స్థానంలో పాచిపెంట అప్పలనర్స, కురుపాం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండంగి రమణ, లోతా రామారావు ఏజెన్సీ నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. వారిని ప్రజలు గెలిపించాలని కోరారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో ఉన్నాయని, బిజెపి, వైసిపి, టిడిపిలతో ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో బిజెపికి పోటీ చేసే అర్హత లేదని తెలిపారు. ఆదివాసీలకు ఉన్న హక్కులను, చట్టాలను రద్దు చేస్తూ గిరిజన ఉనికిని దెబ్బకొడుతున్న వారిని ఎన్నికల్లో ఓడించాలని కోరారు. అటవీ సంరక్షణ చట్టాన్ని యుపిఎ ప్రభుత్వం వామపక్షాల మద్దతుతో తీసుకొచ్చిందని, ఆ చట్టం రావడంతో గిరిజనులు పోడు భూములకు పట్టాలు సాధించుకున్నారని తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేస్తూ టైగర్‌జోన్‌, వన్యప్రాణ సంరక్షణ, అభివృద్ధి పేరుతో వేలాది ఎకరాలను అదానీకి కట్టబెడుతున్నారని విమర్శించారు. అరకు పార్లమెంట్‌ పరిధిలో పంప్డు స్టోరేజ్‌ హైడల్‌ ప్రాజెక్టు పేరుతో అదానీకి సుమారు 1200 ఎకరాలను కట్టబెట్టడానికి ఒప్పందాలు చేసుకుంటున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఏ గ్రామంలోనూ గ్రామసభ నిర్వహించకుండా, పీసా, 1/70 చట్టాలను తుంగలో తొక్కి కార్పొరేట్లకు వేలాది ఎకరాలు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయించి అదానీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం చూస్తోందన్నారు. పోలవరం ప్రాంతంలో ఆయుధ కర్మాగారం పెట్టడానికి అదానీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గిరిజన సబ్‌ ప్లాన్‌ను బిజెపి ఎత్తేసిన తరువాత నిధులు రాక ఏజెన్సీలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పలుచోట్ల డోలీమోతలే శరణ్యమవుతున్నాయని, వైద్య సదుపాయాలు మృగ్యంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో విఫలమైన బిజెపి, వైసిపిలకు ఓటు అడిగే అర్హత లేదన్నారు. అరకు పార్లమెంట్‌ అభ్యర్థి కొత్తపల్లి గీత కేసుల మాఫీ కోసం పార్టీలు మారుతూ చివరకు బిజెపిలో చేరారని విమర్శించారు. అలాంటి ఆమెను ఎంపి అభ్యర్థిగా బిజెపి ప్రకటించిందని తెలిపారు. టిడిపి అధికారంలోకి వస్తే పరిపాలన చేసేది ఢిల్లీ నుంచి మోడీయేనని అన్నారు. చంద్రబాబు, జగన్‌లు కేసుల భయంతో మోడీ చేతుల్లో కీలు బొమ్మలుగా మారారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బిజెపి, దానికి మద్దతు ఇస్తున్న టిడిపి, జనసేన, వైసిపిని ఓడించి సిపిఎం అభ్యర్థులను గెలిపించి చట్ట సభలకు పంపించాలని కోరారు. అనంతరం పార్టీ ముద్రించిన ‘బిజెపికి ఓటు – ఆదివాసీలకు చేటు’ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు.

➡️