పరవాడ ఫార్మా యాజమాన్యాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి : సిపిఎం

Apr 7,2024 12:42 #Acident, #CPIM, #paruvada
  • మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

ప్రజాశక్తి-అనకాపల్లి : పరవాడ ఫార్మా ప్రమాదాలపై విచారణ జరిపి.. కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాధం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పరవాడ ఫార్మా సిటీలోని అరబిందో ఎపిటోరియా ఫార్మా, ఆల్కలీ మెటల్స్‌ కంపెనీల్లో ఈ రోజు ఉదయం జరిగిన ప్రమాదంలో ఆళ్ల గోవిందు (32), చందక రమణ (35) ఇద్దరు కార్మికులు మరణించారని తెలిపారు. ఎపిటోరియాలో మరో 5గురు కార్మికులు తీవ్ర అస్వస్ధకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయాలు పరిహారం ఇవ్వాలని, చికిత్స పొందుతు కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఫార్మాసిటీలో కార్మికుల ప్రాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయని మండిపడ్డారు. భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత లేకుండా పోతుందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కమిటీల పేరుతో హడావడి చేస్తున్నారని.. కంపెనీల్లో ఉన్న లోపాలపై నిరంతరం తనిఖీలు చేయడంలేదన్నారు. ఇన్ని ప్రమాదాలు సంభవిస్తున్నా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, ఫ్యాక్టరీస్‌ ఆప్‌ ఇన్‌స్పెక్టర్‌ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రమాదాలకు కారణమైన కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే తరుచూ ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. గతంలో కూడా పరవాడ, అచ్యుతాపురం సెజ్‌ల్లో జరిగిన ప్రమాదాలపై అధికార యంత్రాంగంతో కమిటీలు వేసి విచారణ నిర్వహించారని.. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలు బహిరంగపర్చలేదన్నారు. దీనితో కార్మికులు, ప్రజల్లో యాజమాన్యాలను రక్షించే పనిలో అధికారులు వున్నారనే అనుమాలు వ్యక్తమౌతున్నాయన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ప్రమాదాలకు కారణమైన రెండు కంపెనీలపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

➡️