సామాన్యులకు సంపన్నులైన బడా కార్పొరేట్‌ శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధమిది : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

విజయవాడ : సామాన్యులకు సంపన్నులైన బడా కార్పొరేట్‌ శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో శ్రీనివాసరావు మాట్లాడుతూ … పెద్ద పెద్ద కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వారు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కార్పొరేట్‌ విద్యాసంస్థల అధినేతలు, పెద్ద పెద్ద కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ వారు, ఎన్‌ఆర్‌ఐలు … మొత్తం 124మంది మొత్తం రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కార్పొరేట్లు హైజాక్‌ చేసేశాయన్నారు. ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు పెట్టి ఓట్లు కొనుక్కొని దాన్ని వ్యాపారంగా మార్చేశారన్నారు. రాజకీయాల్లో రూ.100 పెట్టుబడి పెడితే రూ.వెయ్యి కోట్లు సంపాదించుకోవచ్చునని పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. ఇంత పెద్ద లాభసాటి వ్యాపారంగా రాజకీయాలను మార్చేసిన తరువాత సామాన్యులకు ఏమత్రం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. వారు డబ్బిస్తే వీళ్లు వారి కంపెనీలకు పనులు చేసిపెడతారని ఆరోపించారు. బిజెపి ఈడీ దాడులు చేయించిన 30మంది రాజకీయ కార్పొరేట్‌ వ్యాపారస్తులలో 25మంది బిజెపిలో చేరారనీ, ఎలక్షన్‌ బాండ్లు సమర్పించుకున్నారనీ దీంతో వారి కేసులన్నీ క్లీన్‌ అయ్యాయని అన్నారు. అవినీతిపరుల కూటమిగా బిజెపి మారిపోయిందని ధ్వజమెత్తారు. సామాన్యులకు సంపన్నులైన బడా కార్పొరేట్‌ శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అన్నారు. వైఎస్‌ఆర్‌, టిడిపి, బిజెపిల కూటమి ప్రజలకు 3 హామీలివ్వాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.
1. వారు అధికారంలోకి వస్తే ధరలు పెంచబోమని హామీ ఇవ్వాలి. ధరలు పెంచకుండా స్కీములివ్వాలి.
2. పన్నులు పెంచుతారా? లేదా ? పన్నులు పెంచం అని స్పష్టం చేయాలి
3. జాతీయ (ప్రజల) సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టం అని హామీలివ్వాలని డిమాండ్‌ చేశారు.
ప్రజల అన్ని హక్కులను కాపాడతామని చెప్పాలన్నారు.

➡️