కేంద్రం తక్షణమే 10వేల కోట్లు సాయం చేయాలి : రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

cpm vsr speech in round table on ycp govt failures cyclone drought

ప్రజాశక్తి-విజయవాడ : మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో కేంద్రం తక్షణమే 10వేల కోట్లు సహాయ నిధిని రాష్ట్రానికి ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్రంలో తుఫాన్, కరువు వలన అల్లాడుతున్న రైతులు, గ్రామీణ ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి, వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన, బి.ఆర్.ఎస్ ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు. తొలుత తుఫాన్ వలన ప్రాణాలు కోల్పోయిన వారికి రౌండ్ టేబుల్ సమావేశం నివాళి అర్పించింది. అనంతరం ఆయా పార్టీల నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో తుఫాన్ వలన నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని, మురుగు కాల్వలు అన్నిటిని బాగు చేయాలని రౌండ్ టేబుల్ డిమాండ్ చేసింది. నష్టపోయిన కౌలు రైతులకు ఇచ్చిన పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ సహాయ నిధి సాధనకు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బంద్ కు సిద్దమవ్వాలని రౌండ్ టేబుల్ సూచించింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ… తుఫాన్ వలన పంటలు నష్టపోవడం వెనుక డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యం ఉందని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో కాలువల్లో నీరు ఎక్కడికక్కడ నిలిపోవడంతోనే అనేక చోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.

➡️