ఉద్యోగులు బకాయిలు కట్టకపోతే కరెంట్‌ కట్‌

May 3,2024 10:40 #Current cut, #Employees

అమరావతి : విద్యుత్‌ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్‌లకు కరెంట్‌ కట్‌ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వారు పరిమితికి మించి వాడిన రూ.2.79 లక్షల విద్యుత్‌ బిల్లుని రికవరీ చేయాల్సిందిగా సంబంధిత విభాగాధిపతులు, సచివాలయంలోని సంబంధిత అధికారులకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధానిని అమరావతికి మార్చాక. చాలా మంది ఉద్యోగులు వివిధ కారణాలతో కుటుంబాలను హైదరాబాద్‌లోనే ఉంచి, వారు మాత్రమే ఇక్కడికి వచ్చారు. అలాంటి వారి కోసం గత ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఉచిత నివాస వసతి కల్పించింది. ఆ తర్వాత వైసిపి ప్రభుత్వం కూడా ఆ సదుపాయాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న రెయిన్‌ట్రీపార్క్‌తో పాటు, నవులూరు, ఉండవల్లి, విజయవాడల్లోని పలు అపార్ట్‌మెంట్‌లలో ఒక్కో ఫ్లాట్‌లో కొంత మంది చొప్పున ఉండే ప్రాతిపదికన ఉచిత నివాస వసతి కల్పిస్తోంది. వారిలో ఏయే ఫ్లాట్‌లలో ఉంటున్న ఉద్యోగులు పరిమితికి మించి కరెంటు వాడారో, ఎంత బకాయిపడ్డారనే వివరాలను ఉత్తర్వులకు జీఏడీ జతచేసింది. ఆయా ఫ్లాట్‌లవారీగా సూచించిన బ్యాంక్‌ ఖాతాల్లో వెంటనే ఆ బకాయిలు జమ చేయకపోతే కరెంట్‌ కట్‌ చేస్తామని స్పష్టం చేసింది.

➡️