దగా డిఎస్‌సి కాదు..మెగా డిఎస్‌సి కావాలి

  • డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డిఎస్‌సి అభ్యర్ధుల ధర్నా
  •  పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం

ప్రజాశక్తి-కనిగిరి (ప్రకాశం జిల్లా) : దగా డిఎస్‌సి వద్దని మెగా డిఎస్‌సి కావాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డిఎస్‌సి అభ్యర్థులు ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ధర్నాను అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, డివైఎఫ్‌ఐ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని ధర్నా వద్దకు వచ్చిన ఆర్‌డిఒ జాన్‌ఇర్విన్‌కు డిఎస్‌సి అభ్యర్థులు, నాయకులు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు కనిగిరిలోని సుందరయ్య భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు. పామూరు బస్టాండు సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రప్రభుత్వం గత నాలుగేళ్లుగా అదిగో డిఎస్‌సి.. ఇదిగో డిఎస్‌సి అంటూ నిరుద్యోగులను నిరంతరం మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 117 జిఒతో పదివేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట 1.69 లక్షల మంది ఉమాత్రమే ఉన్నారని, దాదాపు 18,520 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇవే కాక ఈ నెల చివరి నాటికి మరో ఐదు వేలమంది ఉపాధ్యాయులు రిటైర్‌ అవుతారని చెప్పారు. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం 40,000 ఖాళీలు ఉన్నాయన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్‌సి ప్రకటించాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కెఎఫ్‌బాబు, అధ్యక్షులు కె వి పిచ్చయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి పిసి కేశవరావు పాల్గొన్నారు.

➡️