ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

Apr 17,2024 22:07 #MLC KS Lakshmana Rao, #ongle, #sadassu
  • సమైక్య విధానాన్ని దెబ్బతీసే శక్తులకు బుద్ధి చెప్పాలి
  • సదస్సులో ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు

ప్రజాశక్తి – ఒంగోలు సబర్బన్‌ : రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమైక్య విధానం, న్యాయ విధానాలు దెబ్బతింటున్నాయని, వీటిని కాపాడుకునేందుకు ప్రజలు, ప్రజాతంత్ర వాదులంతా ముందుకు వచ్చి రానున్న ఎన్నికల్లో వాటిని రక్షించుకునేందుకు తగిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. ‘భారత రాజ్యాంగం- ప్రజాస్వామ్య వ్యవస్థ- ఎన్నికలు’ అనే అంశంపై ఒంగోలులోని యుటిఎఫ్‌ కార్యాలయంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సదస్సు జరిగింది. కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. 40 ఏళ్ల కిందట పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండేదని, తరువాత కాలంలో ప్రజాస్వామ్య విలువలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. రాజకీయాల్లోకి కార్పొరేట్‌ శక్తులు ప్రవేశించడమే ఇందుకు కారణమని తెలిపారు. రాజకీయాలను శాసించే స్థాయికి వారు ఎదిగారన్నారు. పదేళ్ల బిజెపి పాలనలో అన్ని వ్యవస్థలూ ధ్వంసమయ్యాయని తెలిపారు. మరోవైపు కేంద్రానికి భయపడి ప్రాంతీయ పార్టీలు పూర్తిగా లొంగిపోయాయని, ఇందుకు మన రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఈ పరిస్థితి సుస్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఒక్క ఎమ్మెల్యే లేని బిజెపికి ఆంధ్రరాష్ట్రంలో వంద శాతం ఓట్లు అనుకూలంగా రావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 2029లో జమిలి ఎన్నికలు తెస్తామని బిజెపి చెబుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని అన్నారు. బిజెపి మరలా అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రానున్న ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులకు అనుకూంగా ప్రజలు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాలం సుబ్బారావు, ఎం.రమేష్‌, ఆల్‌ పెన్షనర్స్‌ అసోషియేషన్‌ నాయకులు శేషయ్య, జెవివి జిల్లా కార్య కార్యదర్శి జయప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️