‘వారిని’ గద్దె దించడమే జగ్జీవన్ రామ్ కు నివాళి

ప్రజాశక్తి-విజయవాడ : బిజెపి, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే జగ్జీవన్ రామ్ కు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు తెలిపారు. సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికతత్వాన్ని, ప్రజాస్వామ్యా పరిరక్షణకై పోరాటం సాగించాలని కోరారు. బిజెపికి-మోడీతో పొత్తులో ఉన్న తెలుగుదేశాన్ని, తొత్తులుగా మారిన వైసీపీని ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బిజెపి చేస్తున్న కుట్రలను ఎదుర్కోవాలని, బిజెపి కుట్రలపై జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలని ఆయన తెలిపారు. శుక్రవారం విజయవాడ శిఖామణి సెంటర్ లో బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి బాబురావు పూలమాల వేసి నివాళులర్పించారు. బాబురావుతో పాటు కె.వి.పి.ఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, జిల్లా నగర నేతలు జి.నటరాజ్, జి.క్రాంతి, కె.గురుమూర్తి, శేఖర్, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ….. బాబు జగ్జీవన్ రామ్ తన పదవులను సామాజిక న్యాయాన్ని కాపాడటానికి వినియోగించారని కొనియాడారు. చిన్న వయసులోనే కుల వివక్షతను ఎదుర్కొన్న ఆయన  చివరి వరకు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని తెలిపారు. ఆయన రాజ్యాంగ విలువల మూల సూత్రాలను నేడు బిజెపి, మోడీ పాలనలో నాశనమవుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో 400సీట్లు ఇస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని బిజెపి నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారని, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బిజెపి-మోడీ ప్రభుత్వాలను గద్దె దించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి-మోడీకి ప్రత్యక్షంగా మద్దతునిచ్చే తెలుగుదేశం, పరోక్షంగా మద్దతునిచ్చే వైసీపీలను నిలదీయాలని, ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. ప్రభుత్వ రంగాన్ని, రిజర్వేషన్లను బిజెపి ప్రభుత్వం నాశనం చేస్తోందని , దళితులు, మైనారిటీలు, బలహీనవర్గాలపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను మరో మణిపూర్ లాగా మార్చటానికి డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ముందుకు వస్తున్నారని హెచ్చరించారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి నోరు విప్పటం లేదని అన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలంటే బిజెపిని గద్దె దించాల్సిందేనని పిలుపునిచ్చారు. బిజెపిపై నికరంగా పోరాడే కమ్యూనిస్టులు, వామపక్షాలు, అభ్యుదయవాదులు, లౌకిక శక్తులకు ఎన్నికల్లో బలం చేకూర్చాలని ఆయన కోరారు.  సామాజిక న్యాయం, కోసం జరిగే ఉద్యమాలను బలోపేతం చేయాలని బాబూరావు పేర్కొన్నారు.

➡️