వికలాంగులు, రోగులకు ఇళ్ల వద్దకే పింఛను

Apr 3,2024 07:28 #AP, #Distribution, #pensions

-ఇతరులకు సచివాలయం వద్ద
రేపటి నుంచి పంపిణీ ప్రారంభం
-నూతన మార్గదర్శకాల విడుదల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వికలాంగులకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే రోగులకు ఇళ్లవద్దకే పింఛను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఖరారుచేసిన మార్గదర్శకాలను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పింఛను పంపిణీకి ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. గామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సిఇఒ తొలుత జారీ చేసిన ఆదేశాలను సవరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధివిధానాలను రూపొందించింది. పంచాయతీరాజ్‌ – గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఈ మేరకు తాజా సర్క్యులర్‌ను సెర్ప్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఆర్‌డిఎ పిడిలు, ఎంపిడిఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు పంపించారు. వీటి ప్రకారం లభ్ధిదారులను రెండు విభాగాలుగా విభజించారు. వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు మంచాలకు, కుర్చీలకే పరిమితమైన వృద్ధులు, ఇంటి నుంచి బయటకు రాలేని వారిని మొదటి విభాగంలో చేర్చారు. వీరికి సచివాలయ లేదా ఇతర ప్రభుత్వ సిబ్బంది ఇళ్ల వద్దకే వచ్చి పింఛను అందిస్తారు. మిగిలిన లబ్దిదారులు గ్రామ/వార్డు సచివాలయం వద్దకు వెళ్లి పింఛను తీసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్‌ తప్పనిసరి…!
సచివాలయం వద్దకు వెళ్లి పింఛను తీసుకునే లబ్ధిదారులు తమతో పాటు తప్పనిసరిగా ఆధార్‌కార్డును తీసుకురావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11 గంటల తర్వాత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని, 6వ తేదీ నాటికి ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని తెలిపారు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని గ్రామ/వార్డు సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పని చేయాలని, పింఛన్ల పంపిణీ పూర్తయ్యే వరకూ అన్ని సచివాలయాలు ఈ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని మార్గదర్శకాల్లో తెలిపారు. పింఛన్‌ కోసం వచ్చే లబ్థిదారులకు వడదెబ్బ తగలకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను స్థానిక పరిపాలనా సంస్థలే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దీనిప్రకారం గ్రామాల్లో పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాల్టీలు సచివాలయాల వద్ద తాగునీరు, కూర్చునేందుకు బల్లలు, నీడ కోసం టెంట్‌లు, తదితరాలను ఏర్పాటు చేసుకోవాల్సివుంటుంది. పింఛన్ల పంపిణీ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, పింఛన్‌దారులకు పింఛన్‌ అందజేస్తున్నట్లుగా ఫోటోలు దిగటం, ఇతర ప్రచార కార్యక్రమాలు చేయకూడదు, ఒకవేళ ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

-డిబిటి సాధ్యం కాదు
వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించటంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలని రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు పలు దఫాలుగా ప్రభుత్వ యంత్రాంగానికి సూచించాయి. ఒక వేళ అలా కాని పక్షంలో డైరెక్టు బెనిఫిట్‌ (డిబిటి) పద్ధతిలోనైనా నేరుగా లబ్థిదారుల బ్యాంకు ఖాతాలలో పింఛను పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ఇది సాధ్యం కాదని కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఇతర సమస్యల వల్ల అది కూడా సాధ్యపడదని ప్రభుత్వం పేర్కొంది. దీంతో సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,27,177 సచివాలయ ఉద్యోగుల్లో (12,770 ఎఎన్‌ఎం, 14,232 అగ్రికల్చర్‌, ఇతర ఉద్యోగులు కలుపుకుని) చాలా మందికి ఎన్నికల విధులు కేటాయించారని తెలిపింది.

➡️