విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా?

Apr 3,2024 23:45 #AP High Court, #judgement

– ప్రైవేటీకరణకు ఏ చట్టం అనుమతిస్తోంది?
– కేంద్రానికి ప్రశ్నలు సంధించిన హైకోర్టు
ప్రజాశక్తి-అమరావతి :’ఏ చట్టం కింద విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు? ప్రైవేటీకరణకు ఏ చట్టం అనుమతిస్తోంది? ఇందుకు ఏమైనా చట్టం ఉందా? ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకునే ముందు ఆ కర్మాగారం ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇతర లబ్ధిదారులను సంప్రదించారా? అసలు విశాఖ ఉక్కు కర్మాగార చరిత్ర తెలుసా?’ అని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు సంధించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మాజీ ఐపిఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ, కెఎ పాల్‌, సువర్ణరాజు తదితరులు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై
న్యాయమూర్తులు జస్టిస్‌ ఎవి శేషసాయి, జస్టిస్‌ న్యాపతి విజరుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారణ జరిపింది. పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుండి వివరణలు కోరిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24వ తేదికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ‘ఉక్కు కర్మాగార భూముల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఎన్ని ఉక్కు కార్మాగారాల్లో పెట్టుబడులను కేంద్రం ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది? ఎన్ని ఆచరణలోకి వచ్చాయి?.’ అని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది. అదే విధంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాస్తే దానిపై ఎందుకు స్పందించలేదని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. సిఎం లేఖపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఏమిటో చెప్పాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో సిఎం రాసిన లేఖ గురించి కనీస ప్రస్తావన లేదని ఆక్షేపించింది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వివిధ వర్గాలు ఇచ్చిన భూమిని విక్రయించే విషయంలో పూర్తి వివరాలను అఫిడవిట్‌ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే మాదిరి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించేందుకు విదేశాల నుంచి నిధులను తెస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కెఎ పాల్‌ ఇచ్చిన వినతిపై కూడా కేంద్ర వైఖరి తెలియజేయాలని ఆదేశించింది. ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేటరీ యాక్ట్‌ కింద ప్రత్యేక ఖాతా తెరిచేందుకు అనుమతించాలంటూ పాల్‌ ఇచ్చిన వినతిపై కూడా కేంద్ర వైఖరి తెలియజేయాలని పేర్కొంది.
రూ. 8 వేల కోట్లు తెస్తా : కెఎ పాల్‌
ప్రత్యక్షంగా హాజరైన కెఎ పాల్‌ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే విదేశాల నుండి రూ. 8 వేల కోట్ల నిధులు తీసుకువస్తానని ధర్మాసనానికి తెలిపారు. తాను ఇక్కడ ఉండే ఆ నిధులను సమీకరిస్తానని చెప్పారు. అలా చేయలేకపోతే ధర్మాసనం ఏ శిక్ష విధించినా
భరిస్తానని చెప్పారు. గత 45 ఏళ్లలో విశాఖ ఉక్కు పరిశ్రమ పన్నుల కింద 54 వేల కోట్ల రూపాయలను చెల్లించిందని చెప్పారు.
మరో న్యాయవాది వై కోటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు.
ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం సేకరించిన భూములను అమ్మలేదని ఆర్‌ఐఎన్‌ఎల్‌ తరఫున న్యాయవాది ఎస్‌ వివేక్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సొంత నిధులతో కొనుగోలు చేసిన 25 ఎకరాలను మాత్రమే అమ్ముతున్నట్లు చెప్పిన విషయాలను కోర్టు రికార్డుల్లో నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సివిఆర్‌ రుద్రప్రసాద్‌ కల్పించుకుని, భూముల అమ్మకం వ్యవహారంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. అన్నింటినీ చెప్పే చేస్తామని, పారదర్శకంగానే చేస్తామని, పత్రికలకు ప్రకటించే చేస్తామని చెప్పారు. ఇవే వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. కెఎ పాల్‌ ప్రతిపాదన సంగతి ఏమిటని అడిగింది. నిధుల్ని సమకూర్చుతామని గత మార్చిలో కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చినట్లు హైకోర్టు ప్రశ్నకు సమాధానంగా పాల్‌ చెప్పారు. పాల్‌ వినతిపత్రంపై కూడా కేంద్ర వైఖరిని చెప్పాలని ధర్మాసనం ఆదేశించి విచారణను వాయిదా వేసింది.

➡️