సిఎస్‌కు ఎన్నికల విధులు అప్పగించొద్దు

Apr 4,2024 07:01 #ap cs, #TDP

ఎన్నికల సంఘానికి ఎన్‌డిఎ నేతల ఫిర్యాదు
ప్రజాశకి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్‌డిఎ నేతలు డిమాండ్‌ చేశారు. నాన్‌ఫోకల్‌ పోస్ట్‌లో సిఎస్‌ను ఉంచాలన్నారు. కొంతమంది అధికారులు, అధికార పార్టీ నాయకులు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన చర్యలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధాన అధికారిని సచివాలయంలో కలిసి బుధవారం ఫిర్యాదు చేశారు. అనంతరం టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. పెన్షన్‌ పంపిణీలో ప్రభుత్వం ఇంతలా అభాసుపాలు అవ్వడానికి సిఎస్‌ కారణమని విమర్శించారు. వలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయించొద్దని ఎన్నికల కమిషన్‌ చెప్పిందని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్న మంత్రి జోగి రమేష్‌, వైసిపి నేత పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మదనపల్లె సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులతో ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని చెప్పించారని చెప్పారు. జగన్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ లబ్ధి కోసం పింఛనుదారులకు బాధపెట్టడమే జగన్‌ నైజమని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

➡️