విప్లవచరిత్రను మరవొద్దు : ప్రజలకు సీతారాం ఏచూరి పిలుపు

  • సాయుధపోరాట స్ఫూర్తితో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి : ప్రజలకు సీతారాం ఏచూరి పిలుపు
  • యాదాద్రి-భువనగిరిలో భారీ రోడ్‌ షో

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : సాయుధ తెలంగాణ పోరాట స్ఫూర్తితో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విప్లవ చరిత్రను మరవొద్దని అన్నారు. ‘రజకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మనది. మరోసారి ఆ తెగువ ప్రదర్శించాలి. అసెంబ్లీకి ఎర్రజెండా అభ్యర్థులను పంపాలి’ అని పిలుపునిచ్చారు. సిపిఎం అభ్యర్థులకు ఓటేస్తే మీకు మీరు ఓటేసుకున్నట్లని అన్నారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాయుధ పోరాటం అనంతరం పది వేల ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర మన గడ్డకు ఉందని గుర్తు చేశారు. భూ సంస్కరణలకు మూలం తెలంగాణ సాయుధ పోరాటమని స్పష్టం చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి, మునుగోడు, నకిరెకల్‌ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం భారీ రోడ్‌ షో నిర్వహించారు. దీనికి ఆయా నియోజకవర్గాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ అప్పటి ఎన్నికల్లో పోటీ చేసిన కమ్యూనిస్ట్‌ నేత రావి నారాయణరెడ్డికి భారత తొలి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను శాసనసభలో సమగ్రంగా చర్చించే సత్తా సిపిఎం అభ్యర్థులకే ఉంటుందన్నారు. అసెంబ్లీలో సిపిఎం ఎమ్మెల్యేలు లేనిలోటు ఇటీవల సమావేశాలను పరిశీలిస్తే స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. బిజెపి, కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ రాజకీయాలను వ్యాపారంగా మార్చేశాయని విమర్శించారు. ఆ పార్టీలు, వారి నాయకులు ప్రజాసేవ చేస్తున్నారా? సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. గత పదేళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని, ఇదంతా ప్రజల సొమ్మని గుర్తు చేశారు. రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయలేదని విమర్శించారు. ఒక్క శాతంగా ఉన్న ధనికుల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. దేశంలో 70 శాతం యువజనులకు ఉపాధి లేకపోవడం అత్యంత దారుణమన్నారు. ఎన్నికలు రాగానే గ్యాస్‌ ధర గుర్తొంచిందా? రూ.400 ఉన్న ధరను రూ.1000కి పెంచి, ఎన్నికలు దగ్గరకు రాగానే రూ.200 తగ్గిస్తే సరిపోతుందా? అంటూ మోడీ సర్కారును ప్రశ్నించారు.

త్యాగాలు చేసిన వారిని అసెంబ్లీకి పంపాలి : చెరుపల్లి సీతారాములు

ప్రజాసమస్యలపై పోరాడిన వారిని, త్యాగాలు చేసిన వారిని చట్టసభలకు పంపాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు కోరారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ప్రజలను పట్టించుకోకుండా తమ ఆస్తులను పెంచుకుంటున్నారన్నారు. ఓట్లు కొనుక్కోవడానికి వచ్చే అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభకు సిపిఎం యాదాద్రి-భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్‌ అధ్యక్షత వహించారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కొండమడుగు నర్సింహ, మునుగోడు అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి, నకిరెకల్‌ అభ్యర్థి బొజ్జ చినవెంకులు ప్రసంగించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు పి.ఆశయ్య, రాష్ట్ర నాయకులు కూరపాటి రమేశ్‌, ఆనగంటి వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి ఎరుపుమయం

సీతారాం ఏచూరి రోడ్‌షోకు వేలాది మంది తరలివచ్చారు. ప్లకార్డులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఎర్ర జెండాలతో భువనగిరి జిల్లా కేంద్రం అరుణారుణవర్ణమైంది. యువత, మహిళలు, విద్యార్థులు, పిల్లలు, వృద్ధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు, కోలాటాల బృందాలు పదం పాడుతూ కదం తొక్కుతూ ముందుకు నడిచాయి.

➡️