ఎంపి సీట్లు మాకొద్దు బాబోయ్ !

Jan 22,2024 11:01 #Andhra Pradesh, #MP seats, #ysrcp party

పోటీకి ముందుకురాని మంత్రులు, ఎమ్మెల్యేలు

వైసిపిలో కొత్త చిక్కులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో టికెట్‌లు రాని వారితో వున్న తలనొప్పులను మించి టికెట్‌లు ఖరారైన వారి నుండి కూడా సమస్యలు పెరుగుతుండటం ఆ పార్టీకి చికాకును పెడుతోంది. ఇప్పటికే సర్వేల పేరుతో చాలా మంది సిట్టింగ్‌లను దూరం పెట్టి ఆ పార్టీ అసంతృప్తి రాజేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పార్లమెంట్‌కు మీరే పోటీచేయాలని చెప్పినా కొందరు ధిక్కరిస్తున్న తీరు ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. చిత్తూరు జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యే అయిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రస్తుతం గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుండి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విడుదల చేసిన నాలుగో జాబితాలో ఆయనను అసెంబ్లీకి కాదని చిత్తూరు పార్లమెంట్‌కు అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే రెండు పర్యాయాలు కర్నూలు జిల్లా ఆలూరు నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు తనతో రాజకీయంగా విభేధించే విరుపాక్షికి ఆలూరు అసెంబ్లీకి పోటీచేసే అవకాశం కల్పించి తనను కర్నూలు పార్లమెంట్‌కు అభ్యర్థిగా ప్రకటించడాన్ని గుమ్మనూరు జయరామ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనకు ఎంపి సీటు వద్దని ఆలూరు అసెంబ్లీనే ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఆలూరు విషయంలో వైసిపి అధిష్టానం ఏ మాత్రం వెనక్కు తగ్గే పరిస్థితి లేదని గుమ్మనూరు జయరామ్‌ తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నట్లు తెలిసింది. తెలుగుదేశం ముఖ్యనేతల టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. గుంతకల్‌, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలలో ఎక్కడ అవకాశం ఇచ్చినా పోటీచేస్తానని టిడిపి ముందు ప్రతిపాదనలను పెట్టినా అటువైపు నుండి సానుకూల పరిస్థితులు లేకపోవడంతోకాంగ్రెస్‌ పార్టీ నుండి అయినా అలూరు అభ్యర్థిగా పోటీచేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలిసింది. గుమ్మనూరు జయరామ్‌ వైసిపి అధిష్టానంకు టచ్‌లోకి రాకుండా టిడిపి, కాంగ్రెస్‌లవైపు చూస్తున్నట్లు తెలిసింది. అలాగే గంగాధర నెల్లూరు కాకుండా చిత్తూరుకు పంపడాన్ని నారాయణస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఆయన వర్గం అంతా నారాయణస్వామికి అసెంబ్లీకే పంపాలని కోరుతున్నారు. ఇప్పటికే రాజమండ్రి ప్రస్తుత పార్లమెంట్‌ సభ్యుడు మార్గాని భరత్‌, కాకినాడ ఎంపి వంగా గీతలు తాము పార్లమెంట్‌కు పోటీచేయలేమని గట్టిగా పట్టుబట్టడంతో వారిద్దరిని అసెంబ్లీకి పోటీచేసేందుకు అవకాశం కల్పించారు. అలాగే నంద్యాల పార్లమెంట్‌కు మైనార్టీ అభ్యర్థిని బరిలో నింపేందుకు కడప ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అంజాద్‌భాష, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌లను వైసిపి అధిష్టానం ఒప్పిస్తున్నా వారు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. అలాగే ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి ఎవరనే అంశాన్ని ఆపార్టీ తేల్చలేక పోతోంది. మొత్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో ఎంపి అభ్యర్థుల ఎంపిక ఆపార్టీకి తలనొప్పిగా మారింది.

➡️