10 శాతం పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌

  • థర్మల్‌ యూనిట్ల మరమ్మతులు పూర్తి చేయాలి
  • ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ డిమాండ్‌ దేశవ్యాప్తంగా ప్రతియేటా 10 శాతం పెరుగుతుందని కేంద్ర ఇంధనశాఖ కూడా అంచనా వేసిందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ తెలిపారు. 2030 వరకూ పెరుగుదల ఇలానే ఉంటుందన్నారు. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డిసి) అంచనా వేసిందన్నారు. విజయవాడలో జరిగిన సదరన్‌ రీజనల్‌ పవర్‌ కమిటీ (ఎస్‌ఆర్‌పిసి) 210వ ఆపరేషన్‌ కో-ఆర్డినేషన్‌ సబ్‌ కమిటీలో బుధవారం ఆయన మాట్లాడారు. గడువు దాటిన పాత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు మరమ్మతులు చేసి 2030 వరకూ విద్యుదుత్పత్తి కొనసాగించాలని కేంద్ర ఇంధనశాఖ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఈ పనులు పూర్తిచేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న ప్లాంట్లను పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న వేసవిలో డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరా చేయడం కష్టమవుతుందని వివరించారు. రాష్ట్రంలో గతేడాది ఊహించని విధంగా రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ 265 మిలియన్‌ యూనిట్ల(ఎంయు)కు చేరిందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు సమైక్యంగా పనిచేయాలని ఎస్‌ఆర్‌పిసి నిర్ణయించిందని అన్నారు. ఈ లక్ష్యంతో ఉత్తమ ఫలితాల సాధన దిశగా చర్చించి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో కృష్ణపట్నం, ఎన్‌టిటిపిఎస్‌ ప్లాంట్లలో 800 మెగావాట్ల యూనిట్ల చొప్పున విద్యుదుత్పత్తి ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌కు మరో 15 నుంచి 20 ఎంయుల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. భవిష్యత్తులో పునరుత్పాదక విద్యుత్‌ ప్లాంట్లకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అంశం థర్మల్‌ ప్లాంట్లకు సవాల్‌గా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఆర్‌పిసి కో-ఆర్డినేషన్‌ సబ్‌ కమిటీ కార్యదర్శి సభ్యులు అజిత్‌ సింగ్‌, ఎపి ట్రాన్స్‌కో డైరెక్టర్‌ కెవి భాస్కర్‌, ఎస్‌ఆర్‌ఎల్‌డిసి సిజిఎం రమేష్‌, జెన్‌కో థర్మల్‌ డైరెక్టర్‌ బాబ్జీ, హెచ్‌ఆర్‌ సయ్యద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

➡️