డబుల్‌ ఇంజిన్‌ సర్కారొస్తే ప్రతి గ్రామం మణిపూరే

May 8,2024 08:45 #brundakarath, #speech

ఇండియా వేదికతోనే ఆదివాసీలకు రక్షణ
– సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌
– అనంతగిరి, అరకు, ముంచంగిపుట్టుల్లో రోడ్డు షో, సభలు
ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అల్లూరి జిల్లా విలేకరులు
ఆదివాసీ ప్రాంతంలో వనరులను లూటీ చేసి, హక్కులపై దాడి చేస్తోన్న బిజెపిని, దాని తొత్తులుగా ఉన్న వైసిపి, టిడిపిలను ఈ ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌ పిలుపునిచ్చారు. ప్రజల హక్కులకు, బతుకులకు భరోసానిచ్చే ఇండియా వేదికను బలపర్చాలని ఆదివాసీలను కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి, అరకు, ముంచంగిపుట్టుల్లో ఇండియా వేదిక బలపరిచిన అరకు సిపిఎం లోక్‌సభ అభ్యర్థి పి.అప్పలనర్స, అరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టి గంగాధర్‌ స్వామికి మద్దతుగా మంగళవారం జరిగిన సభల్లో ఆమె మాట్లాడారు. యుపిఎ-1 ప్రభుత్వంపై వామపక్షాలు ఒత్తిడి తెచ్చి సాధించిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసేలా అటవీ సంరక్షణ చట్టాన్ని మోడీ ప్రభుత్వం సవరించిందని తెలిపారు. నాడు బాక్సైట్‌ను లూటీ చేయకుండా అటవీ హక్కుల చట్టం ద్వారా అడ్డుకున్నామని గుర్తుచేశారు. అదానీ, అంబానీ వంటి వారికి ఖనిజ, సహజ సంపదలను కట్టబెట్టి, అటవీ ప్రాంతం నుంచి గిరిజనులను గెంటివేయడానికి గ్రామ సభ హక్కును మోడీ ప్రభుత్వం నేడు లేకుండా చేసిందని విమర్శించారు. పీసా, ఐదో షెడ్యూల్‌ హక్కులను కాపాడుకోవాలంటే బిజెపిని ఓడించాలన్నారు. లోక్‌సభలో 23 ఎంపి సీట్లున్న వైసిపి… ప్రత్యేక హోదా, అధిక ధరలు, రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు నల్ల చట్టాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎపిలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వస్తే మణిపూర్‌లో వనరులు కొల్లగొట్టడానికి క్రిస్టియన్‌ గిరిజనులపై దాడులు జరిగినట్టే ఇక్కడ ఖనిజ సంపద కోసం ఆదివాసీలపై దాడులు జరుగుతాయని హెచ్చరించారు. ప్రజలకు మంచినీరు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించని మోడీ ప్రభుత్వం తన అధికారం నిలబెట్టుకోవడానికి ప్రజల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు చేస్తోందని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ.. ఏజెన్సీలో హైడల్‌ పవర్‌ ప్రాజెక్టులను అదానీకి అప్పగించి, గిరిజనులకు అన్యాయం చేసేందుకు ఎంపి అభ్యర్థిగా కొత్తపల్లి గీతను బిజెపి నిలబెట్టిందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ.. ఆదివాసీలకు ఇండియా వేదిక ద్వారానే రక్షణ అని తెలిపారు. సిపిఎం సీనియర్‌ నాయకులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ.. అటవీ చట్ట సవరణ తరువాత ఛత్తీస్‌గఢ్‌లో ప్రాజెక్టుల పేరుతో బగ్గు గనులను అక్రమించుకుంటున్నట్లే, ఏజెన్సీలో మైనింగ్‌ను దోపిడీ చేయడానికి అనకాపల్లి, అరకు ఎంపీ స్థానాల నుంచి సిఎం.రమేష్‌, కొత్తపల్లి గీతలను బిజెపి పోటీలో నిలబెట్టిందన్నారు. కాంగ్రెస్‌ అరకు ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టి గంగాధర్‌ స్వామి మాట్లాడుతూ.. ఏజెన్సీలో బిజెపి, వైసిపి, టిడిపిలు గెలిస్తే ఆదివాసీ ప్రాంతం సర్వనాశనమవుతుందన్నారు. ఆయా సభల్లో సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు, అనంతగిరి సిపిఎం జడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు తదితరులు పాల్గన్నారు. అనంతగిరి, అరకు, ముంచంగిపుట్టుల్లో సాగిన రోడ్‌షో ఆకట్టుకుంది.

➡️