పల్నాడులో బాంబుల కలకలం

May 8,2024 20:37 #bombs, #palanadu

– గ్రామాన్ని ఐదేళ్ల కిందట వదిలిన వారి ఇంట్లో బాంబులు, కత్తులు స్వాధీనం
ప్రజాశక్తి – దుర్గి (పల్నాడు జిల్లా) :పోలింగ్‌ సమీపిస్తున్న వేళ పల్నాడు జిల్లా దుర్గి మండలంలో బుధవారం బాంబుల కలకలం రేగింది. మండలంలోని జంగమహేశ్వరపాడులోని ఓ ఇంట్లో నాటు బాంబులు, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ ఘర్షణల నేపథ్యంలో గ్రామాన్ని ఐదేళ్ల కిందట వీడి వెళ్లిన టిడిపికి చెందిన వారి ఇళ్లల్లో ఇవి దొరికాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఎన్నికలప్పుడు పోలింగ్‌ రోజున గ్రామంలో వివాదం తలెత్తింది. వైసిపి వారిపై టిడిపికి చెందినవాళ్లు రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై కేసులూ నమోదయ్యాయి. పోలింగ్‌ ముగిసిన వెంటనే టిడిపికి చెందిన పలు కుటుంబాలు గ్రామాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయి. ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వచ్చిన జల్లయ్య అనే వ్యక్తి రాజకీయ వివాదాల కారణంగా హత్యకు గురయ్యారు. దీంతో గ్రామాన్ని వీడిన వారెవ్వరూ తిరిగి రాలేదు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో వారు గ్రామానికి రావడం కోసం రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించగా కొంతమంది పురుషులు మాత్రమే రెండ్రోజుల కిందట పోలీసుల సంరక్షణలో గ్రామానికి చేరుకున్నారు. వీరంతా ఎవరి ఇళ్లల్లో వారు కాకుండా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. పరిస్థితులు బాగుంటే పోలింగ్‌ తేదీ నాటికి తమ కుటుంబాల్లోని మిగతావారినీ తీసుకొద్దామని అనుకున్నారు. ఈ క్రమంలో వీరిలో ఒకరైన గుమ్మా నాగరాజు ఇంట్లో బాంబులు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు ఎస్‌ఐ కోటయ్య ఆధ్వర్యంలో బుధవారం తనిఖీ చేపట్టారు. 17 నాటు బాంబులు, పది ఇనుప రాడ్లు, మూడు పిడికత్తులు, మూడు పిడిలేని కత్తులు, ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటికి చెందిన నాగరాజుతోపాటు ఇటీవలే గ్రామానికి వచ్చిన వారినీ విచారించారు. అయితే ఇవి తమ ఇళ్లల్లోకి ఎలా వచ్చాయో తమకు తెలీదని, ఆ ఇళ్లకు తాము వెళ్లనూ లేదని చెప్పారు. పోలీసుల సమక్షంలో గ్రామానికి రెండ్రోజుల కిందట వచ్చిన తామంతా ఒకచోటే ఉంటున్నామని చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలిని గురజాల డిఎస్‌పి పల్లంరాజు పరిశీలించారు.

➡️