నిష్పక్షపాతంగా ఎన్నికలు

  • అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా పరిగణించాలి : నితీష్‌ వ్యాస్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా పరిగణిస్తూ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనరు నితీష్‌ వ్యాస్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలను ఆదేశించారు. ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్‌పిలు, ఎన్నికల సాధారణ, పోలీస్‌, వ్యయ పరిశీలకులతో శువ్రారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా నితీష్‌ వ్యాస్‌ మాట్లాడుతూ.. ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాల్లో తరచూ ఎన్నో సంఘటనలు చోటుచేసు కుంటున్నా యని, ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలను సునిశితమైన రాష్ట్రాలుగా గుర్తించామన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి హింస, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పటిష్టంగా అమలు పరచాలని, ఎటువంటి విధాన పరమైన లోపాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆయా కేంద్రాల్లో జరిగే ఎన్నికల సరళిని వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఇంటిగ్రేటెడ్‌, కంట్రోల్‌ సెంటర్లలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎన్నికలకు ఒకరోజు ముందుగానే వెబ్‌ కాస్టింగ్‌ పనితీరును ట్రయల్‌ రన్‌ ద్వారా పరీక్షించుకో వాలన్నారు. ఎన్నికల రోజు వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రికార్డయ్యే ఫీడ్‌ను భద్రపరుచుకోవాలని నితీష్‌వ్యాస్‌ పేర్కొన్నారు. షాడో ఏరియాల్లో ఉండే పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్టమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థను ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
తాగునీరు, వైద్యులు అందుబాటులో..
ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్‌ చీకటి పడే వరకు జరిగిందని, ఆ అనుభవాల దృష్ట్యా ఈ దఫా పోలింగ్‌ బూత్‌ల వద్ద లైటింగ్‌, బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లు, ఎస్‌పిలను నితీష్‌వ్యాస్‌ ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఎవరూ వడదెబ్బకు గురికాకుండా క్యూలైన్లన్నీ షామియానాలతో కవర్‌ అయ్యేలా చూడాలన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులైన మంచినీరు, ప్రథమ చికిత్స కేంద్రాలు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇవిఎంల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి ముందస్తు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినా వెంటను సమస్యను పరిష్కరించేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, లిక్కర్‌, డ్రగ్స్‌, ఉచితాల అక్రమ రవాణాను నియంత్రించాలని, రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల్లో నిరంతరం నిఘా ఉంచాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎపిఎస్‌పి బెటాలియన్స్‌ అడిషనల్‌ డిజిపి అతుల్‌సింగ్‌, రాష్ట్ర పోలీస్‌ నోడల్‌ అధికారి, అడిషనల్‌ డిజిపి (లా అండ్‌ ఆర్డర్‌) ఎస్‌ బాగ్చీ, అదనపు సిఇఒ హరీందర్‌ ప్రసాద్‌, ప్రొవిజన్‌ అండ్‌ లాజిస్టిక్‌ ఐజిపి వెంకటరామిరెడ్డి, టెక్నికల్‌ సర్వీసెస్‌ డిజిపి ఎస్‌ హరికృష్ణ, సెబ్‌ ఐజి రవిప్రకాష్‌, లా అండ్‌ ఆర్డర్‌ డిజిపి సెంథిల్‌కుమార్‌, కమ్యూనికేషన్‌ డిఐజి ఎన్‌ఎస్‌జె లక్ష్మితోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు, ఎన్నికల వ్యయ పరిశీలకులు పాల్గొన్నారు.

➡️