నకిలీ జిఎస్‌టి అధికారి అరెస్టు

May 11,2024 23:35 #arrested, #Fake GST officer

– ఓ పరిశ్రమ నుంచి రూ.ఐదు లక్షల డిమాండ్‌
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ (గుంటూరు జిల్లా) :ఎన్నికల నేపథ్యంలో అందరూ రాజకీయాలతో బిజీగా ఉంటే ఇదే అదునుగా భావించిన ఓ వ్యక్తి జిఎస్‌టి అధికారి అవతారమెత్తి వసూళ్ల పర్వానికి తెరలేపాడు. చిన్న పరిశ్రమల యజమానులను లక్ష్యంగా చేసుకొని వారిని బెదిరిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఓ పరిశ్రమ యజమాని రామరాజు వద్దకు రెండ్రోజుల క్రితం విజయవాడకు చెందిన డి.ఆంజనేయులు వచ్చాడు. తాను సిజిఎస్‌టి అధికారినని పరిచయం చేసుకుని కంపెనీ వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అనంతరం రూ.ఐదు లక్షలివ్వాలని డిమాండ్‌ చేశాడు. అయితే తాను పన్ను చెల్లిస్తున్నానని, అంత మొత్తం ఎందుకివ్వాలని రామరాజు ప్రశ్నించారు. ఇది మామూలేనని, ఇతర కంపెనీ వాళ్లు కూడా ఇచ్చారని పలు పేర్లను చెప్పాడు. దీనిపై సదరు కంపెనీ యజమాని సిజిఎస్‌టి అధికారులను ఆశ్రయించగా అతనెవరో తమకు తెలీదని వారు చెప్పారు. దీంతో కంపెనీ యజమాని పోలీసులను, మీడియాను ఆశ్రయించారు. డబ్బులు తీసుకునేందుకు ఎర్రబాలంలోని కంపెనీ వద్దకు ఆంజనేయులు రాగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

➡️