అప్పులపై తప్పుడు ప్రచారం : మండలిలో బడ్జెట్‌పై చర్చలో మంత్రి బుగ్గన

Feb 9,2024 10:40 #Council, #debate, #debt, #false, #minister

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసిందని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం శాసనమండలిలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. 13 మంది సభ్యులు చర్చలో పాల్గొనగా, చివరగా మంత్రి సమాధానం చెబుతూ.. టిడిపి హయాంలో చేసిన అప్పుల కన్నా గత నాలుగున్నరేళ్లలో చేసిన అప్పులు తక్కువేనని ఆయన తెలిపారు. టిడిపి మాదిరి తాము మేనిఫెస్టోను నిర్లక్ష్యంగా పక్కన పడేయలేదని, ప్రతి అంశాన్నీ అమలు చేశామని అన్నారు. పాలనా వికేంద్రీకరణ, మహిళలను మహరాణులుగా చేయడం, అన్నపూర్ణ ఆంధ్రగా ఆహార ఉత్పత్తులను పెంచడం, 65 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం ద్వారా పేదలకు చేయూతను అందించామని, భూ రక్ష, భూ యాజమాన్యాలకు శాశ్వత భూ హక్కులు కల్పించడం, స్థిరమైన అభివృద్ధి, విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు ఇతోధిక ప్రోత్సాహంతో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చినట్టు తెలిపారు. 2018-19లో రూ.1.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆమోదించగా, రూ.1.64 లక్షల కోట్లను మాత్రమే అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. 2023-24లో తమ ప్రభుత్వం 2.79 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలపగా, రూ.2.75 లక్షల కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలిపారు. 2014-19 వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు 60 శాతం ఉండగా, 2019-24 మధ్యలో కేంద్రం అప్పులు 86 శాతానికి పెరిగాయన్నారు. 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వం అప్పులు గతంలో కన్నా 126 శాతం పెరగ్గా, 2019-24 మధ్య వైసిపి హయాంలో అప్పులు 95 శాతం మాత్రమే పెరిగిన విషయం గమనించాలన్నారు. టిడిపి హయాంలో రుణమాఫీ చేస్తామని తప్పుడు హామీ ఇచ్చి రైతులను మోసం చేసిందన్నారు. మొత్తం రూ.87,610 కోట్ల వరకు రుణమాఫీ చేస్తామని కేవలం రూ.15 వేల కోట్లు రుణాలు మాఫీ చేసి రైతులకు అసలు, వడ్డీలు చెల్లించలేక నష్టపోయే పరిస్థితిని కల్పించిన టిడిపిని రైతులు ఎప్పటికీ నమ్మరన్నారు. సున్నా వడ్డీకి రూ.11 వేల కోట్ల ఖర్చు చేయాల్సి ఉండగా, టిడిపి హయాంలో రూ.600 కోట్లు ఖర్చు చేసిందన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని మహిళలను మోసం చేశారన్నారు.

పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో భాగంగా రూ.1050 కోట్లు విడుదల చేసినట్లు బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారని గత ఐదేళ్లలో ఈ నిధులు వచ్చాయా? అని ప్రశ్నించారు. దీనికి బుగ్గన సమాధానం ఇస్తూ.. టిడిపి హయాంలో ఏడాదికి ఏడు జిల్లాలకు రూ.350 కోట్ల చొప్పున రూ.1,050 కోట్లు కేటాయించినప్పటికీ రూ.700 కోట్లు ఖర్చు చేయకపోవడం వల్ల వెనక్కి వెళ్లాయన్నారు. టిడిపి ప్రభుత్వ విధానాల వల్లే పోలవరం నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. పట్టిసీమ కోసం పోలవరం పనులను రెండేళ్లపాటు ఆలస్యంగా ప్రారంభించారని అన్నారు. పట్టిసీమ రూ.600 కోట్లతో చేపట్టాల్సి ఉండగా రూ.1600 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. పోలవరం కుడికాలువ ద్వారా ఎంత ఉపయోగమో పట్టిసీమ వల్ల అంతే ఉపయోగం అన్నారు. పోలవరం నిర్మాణం కేంద్రమే నిర్మించి ఉంటే ఇబ్బంది లేకుండా పూర్తయ్యేదన్నారు. చర్చ అనంతరం బడ్జెట్‌ ప్రతిపాదలను ఆమోదిస్తున్నట్టు మండలి ఛైర్మన్‌ మోషేను రాజు ప్రకటించారు. అనంతరం సభ వాయిదా పడింది.

స్పీకరు ముందుకు రెబల్‌ ఎమ్మెల్యేలువైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు అనర్హతకు సంబంధించిన పిటిషన్‌ విచారణలో భాగంగా గురువారం స్పీకరు తమ్మినేని సీతారామ్‌ ముందు ఆయన ఛాంబర్‌లో హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి తన న్యాయవాదులతోపాటు హాజరయ్యారు. తమపై చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సర్టిఫైడ్‌ కాపీలు ఇవ్వాలని స్పీకరు కోరారు. స్పీకరుకు సిఎం జన్మదిన శుభాకాంక్షలుశాసనసభ స్పీకరు తమ్మినేని సీతారామ్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రాష్ట్ర శాసనసభ ఆవరణలోని స్పీకరు ఛాంబర్‌కు సిఎం జగన్‌ వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే శాసనమండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు కూడా స్పీకరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ ప్రారంభం కాగానే సభలో వున్న వైసిపి, టిడిపి సభ్యులంతా మూకుమ్మడిగా స్పీకరు తమ్మినేని సీతారామ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️