వివేకా హంతకులకు గుణపాఠం చెప్పండి

వైసిపి ప్రజాప్రతినిధులు బయటకు రావాలి

వివేకా వర్థంతి సభలో షర్మిల, సునీత

ప్రజాశక్తి -కడప ప్రతినిధి :మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హంతకుల్ని కాపాడుతున్న వారికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల, ఆమె సోదరి సునీత అన్నారు. దీనికోసం వైసిపి ప్రజాప్రతినిధులు పార్టీ నుండి బయటకు రావాలని కోరారు. శుక్రవారం కడప నగర శివారులోని జయరాజ గార్డెన్స్‌లో వివేకా ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని స్మారక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ తమ్ముడికి ఐదేళ్లుగా న్యాయం జరగని నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎవరుహత్య చేశారో అప్పుడు తెలియదని, అన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయని, బంధువులే హత్య చేశారని అర్ధమవుతోందని చెప్పారు. ‘అన్నా అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణగా ఉన్నాడని’ అన్నారు. చెల్లెలికి న్యాయం చేయాల్సింది పోయి చివరికి ఆమే హత్యచేసిందన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సునీత కుటుంబం హత్య చేసి ఉంటే ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు. వైఎస్‌ వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ ‘మీ చిన్నాన్నను చంపిన, చంపించిన వారిని గుర్తించాలి, అది ముఖ్యమంత్రిగా మీ బాధ్యత. అది నేనైనా, నా కుటుంబమైనా తేల్చాలి. నేను చంపినట్లు ఆధారం ఉంటే సిబిఐకి ఇవ్వాలి’ అని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. అధికారంలో కొనసాగుతూ తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ‘ సాక్షి చైర్మన్‌ భారతీ గారూ..మీకో విన్నపం. మీ దగ్గర ఆధారాలుంటే సిబిఐకి ఇవ్వండి.’ అని అన్నారు. వైసిపి పునాదుల్లో వైఎస్‌ వివేకా, కోడికత్తి శ్రీను రక్తం దాగి ఉందని విమర్శించారు. వైసిపి ప్రజాప్రతినిధుల్లా బయటికి రావాలని లేనిపక్షంలో ఈపాపం వారికీ చుట్టుంకుంటుందని అన్నారు.

➡️