కోనసీమలో ఘోర రోడ్డు ప్రమాదం

May 14,2024 22:15 #4 died, #Konaseema, #road accident
  •  నలుగురు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు

ప్రజాశక్తి – అమలాపురం (అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) : డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వ్యవసాయ కార్మికులే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పి.గన్నవరం మండలంలోని ఊడిమూడి వద్ద రోడ్డు పక్కన ట్రాక్టర్‌ పెట్టి ధాన్యం బస్తాలను ఎక్కిస్తున్నారు. ఆదిమూలంవారిపాలెం, గంటి పెదపూడికి చెందిన పది మంది వరకూ వ్యవసాయ కార్మికులు ఈ పనుల్లో నిమగమయ్యారు. అదే సమయంలో రాజోలు నుంచి రాజమహేంద్రవరం వైపు వేగంగా వెళ్తున్న ఆర్‌టిసి బస్సు అదుపు తప్పి వీరిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో బెల్లంపూడి పంచాయతీ పరిధిలోని ఆదిమూలంవారి పాలేనికి చెందిన చిలకలపూడి మణి (26), గంటిపెదపూడికి చెందిన వాసంశెట్టి సూర్యప్రకాశరావు (30), నూకపెయ్యి శివ (35), ఈరి కట్లయ్య (38) ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అమలాపురంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నలుగురిలో చిలకలపూడి సురేష్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు ఐసియులో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️