ఎట్టకేలకు చిక్కిన చిరుత – తిరుపతి జూకు తరలింపు

Jun 28,2024 21:01 #caught, #Cheetah

ప్రజాశక్తి – మహానంది (నంద్యాల జిల్లా) :నంద్యాల జిల్లా మహానంది శిరివెళ్ల మండలాల పరిధిలోని పచ్చర్ల గ్రామంలో మాజీ ఉప సర్పంచ్‌ షేక్‌ మెహమున్నీసాను తీవ్రంగా గాయపరిచి చంపిన చిరుత పులి ఎట్టకేలకు శుక్రవారం బోనులో చిక్కింది. నంద్యాల ప్రాజెక్టు టైగర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ బిఎన్‌ఎన్‌ మూర్తి, నంద్యాల సబ్‌ డిఎఫ్‌ఒ శ్రీనివాస్‌ రెడ్డిల ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు మూడు బోన్లు, సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. పచ్చర్ల టోల్‌గేట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో శుక్రవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్‌ అధికారులు తీవ్రంగా శ్రమించారు. దీంతో పచ్చర్ల గ్రామ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చిరుతను చూడడానికి స్థానికులతో పాటు ప్రయాణికులు ఎగబడ్డారు. అధికారులు చిరుతకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి తిరుపతి జూకు తరలించారు.

➡️