వైసిపిలో అడుగడుగునా అవమానాలు- మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌

ప్రజాశక్తి- తుళ్లూరు (గుంటూరు జిల్లా) :వైసిపిలో అడుగడుగునా అవమానాలకు గురయ్యానని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పదేపదే తక్కువగా చూసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌తో ప్రయాణం బాగుంటుందని అనుకున్నప్పటికీ అది నిరాశ కలిగించిందని చెప్పారు. రాజధాని ప్రాంతం వెంకటపాలెంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తాడికొండకు ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగా తనను ఆ నియోజకవర్గానికి వైసిపి సమన్వయకర్తగా నియమించడంతో ఆమెకు, తనకు మధ్య గొడవలకు దారితీసిందని చెప్పారు. తరువాత తనను ఏ మాత్రమూ సంప్రదించకుండా కత్తెర సురేష్‌ కుమార్‌ను ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారన్నారు. తాడికొండ టికెట్‌ తనకు కేటాయిస్తామని చెప్పి మేకతోటి సుచరితకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు మాట కూడా చెప్పకపోవడం, తనను పిలిచి మాట్లాడకపోవడంతో చాలా అవమానంగా ఫీలయ్యానని చెప్పారు. ఒత్తిడికి గురై తప్పనిసరి పరిస్థితుల్లో వైసిపికి రాజీనామా చేశానని చెప్పారు. వైసిపిలో, ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత లేకుండా చేశారని వాపోయారు. వైసిపిలో ఏమి కోల్పోయానో అది టిడిపిలో దక్కుతుందని భావిస్తున్నానన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలన్నదే తన అభీష్టమన్నారు. ఎమ్మెల్యేలను కలుస్తానని, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తదితర అంశాలను వైసిపి మేనిఫెస్టోలో పొందుపరిస్తే బాగుంటుందన్నారు.

➡️