హామీల అమలుకు జిఒలు ఇవ్వాలి : అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి

Jan 29,2024 10:46 #Anganwadis, #implement, #Promises

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : అంగన్‌వాడీల సమ్మె సందర్భంగా జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం జిఒలను విడుదల చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌ వద్ద అంగన్‌వాడీల సమ్మె విజయోత్సవ సభను ఆదివారం నిర్వహించారు. తొలుత మున్సిపల్‌ స్టేడియం నుంచి కోటి పల్లిబస్టాండ్‌ వరకూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యాంబ అధ్యక్షతన జరిగన సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి పాల్గొన్నారు. బేబిరాణి మాట్లాడుతూ సమ్మెను విరమించామంటే దాని అర్థం పోరాటం ముగిసినట్లు కాదన్నారు. ఇది తాత్కాలిక విరామమేనని స్పష్టం చేశారు. 11 డిమాండ్లలో 9 డిమాండ్లపై నిర్ధిష్టంగా ఆదేశాలు ఇస్తామని జగన్‌ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. జులైలో యూనియన్‌ నాయకులతో చర్చించి వేతనాలు పెంచుతామని తెలిపిందని, ఈ కారణంగానే సమ్మెను విరమించినట్లు చెప్పారు. అనంతరం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 42 రోజుల సమ్మె కాలంలో అంగన్‌వాడీలను ప్రభుత్వం నానా విధాలుగా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఎస్మా ప్రయోగించినా, టెర్మినేషన్‌ లెటర్లు ఇచ్చినా మొక్కవోని దీక్షతో ఐక్యంగా ఉండి పోరాట పటిమను కనబర్చారన్నారు. సమ్మెకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.బేబీరాణి, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్‌ఎస్‌.మూర్తి, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం. సుందరబాబు, బి. రాజులోవ, జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌. అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️