నేడు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

Mar 17,2024 08:47 #Exams, #group, #Prelims

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు విస్తృతమైన ఏర్పాట్లు చేసిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్‌ 8న కమిషన్‌ 81 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆదివారం ప్రిలిమ్స్‌ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు ఏర్పాట్లపై జవహర్‌ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం కలెక్టర్లు, ఎస్పిలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, 301 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఐఏఎస్‌ అధికారిని ఇన్‌చార్జిగా నియమించిన్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్‌ సరఫరా, తాగునీరు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. జవాబుపత్రాలు, ఇతర సామగ్రిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

➡️