అంగన్‌వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Jan 11,2024 08:24 #Anganwadi strike, #AP High Court
high court on sand mining

ప్రజాశక్తి-అమరావతి : అంగన్‌వాడీల సమ్మె వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22కు విచారణను వాయిదా వేస్తున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీల సమ్మెను విరమింపజేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది కొలుసు ఉషారాణి వేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని భోజన విరామ సమయంలో (లంచ్‌మోషన్‌ పిటిషన్‌)పై విచారణ జరపాలని కోరారు. న్యాయవాది సుధాకర్‌ వాదిస్తూ.. అంగన్‌వాడీలు సమ్మె చేయడం వల్ల పౌష్టికాహారం అందక గర్భిణులు, శిశువులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనిపై ఎజి ఎస్‌ శ్రీరామ్‌ స్పందిస్తూ.. అంగన్‌వాడీల సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. ఎస్మా కూడా ప్రయోగించినట్లు చెప్పారు. ఇతర శాఖల ద్వారా సేవలకు అంతరాయం లేకుండా చేస్తున్నట్లు పేర్కొన్నారు. విధుల్లో చేరకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

➡️