పాలిటెక్నిక్‌తో ఉన్నత స్థితికి – ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Apr 2,2024 23:39 #MLC KS Lakshmana Rao, #speech

ప్రజాశక్తి-పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) :పాలిటెక్నిక్‌ కోర్సు ద్వారా ఉన్నత స్థితికి చేరొచ్చని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జడ్‌పి పాఠశాలలో యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, జెవివి ఆధ్వర్యాన పాలీసెట్‌ ఉచిత శిక్షణ కేంద్రాన్ని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఐఐఐటి తర్వాత ఎపిఆర్‌జెసి, పాలిటెక్నిక్‌ కోర్సుల ద్వారా తక్కువ ఖర్చుతో డిగ్రీ పొందొచ్చని తెలిపారు. ఎంతో డిమాండ్‌ ఉన్న పాలిసెట్‌కు ఉచితంగా శిక్షణ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యలే కాకుండా సామాజిక బాధ్యతతోనూ యుటిఎఫ్‌ వ్యవహరిస్తోందని, పదో తరగతి విద్యార్థులకు మోడల్‌ టెస్ట్‌ పేపర్లనూ అందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల కో-ఆర్డినేటర్‌ డి.శ్రీనివాసరావు, యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.

➡️